బాధలను తీర్చేటి బంగారు మైసమ్మ
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అనేక ప్రాంతాలలో వివిధ నామాలతో గ్రామదేవతగా ఆవిర్భవిస్తూ తన బిడ్డలను కాపాడుతూ వస్తోంది. ఆమె మానవ జన్మనెత్తి ... ఆ తరువాత గ్రామదేవతగా మారిన సందర్భాలు కూడా లేకపోలేదని గ్రామస్తులు చెబుతుంటారు. అలాంటి విశ్వాసానికి నిదర్శనంగా 'కళ్ళేపల్లి'లోని 'బంగారు మైసమ్మ' ఆలయం కనిపిస్తుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పరిధిలో ఈ ఆలయం అలరారుతోంది.
పూర్వం ఇక్కడి నుంచి అయిదు కుటుంబాలకి చెందిన కొంతమంది వ్యవసాయదారులు ఇతర ప్రాంతాలకి వెళ్లి, అక్కడ తమ పంటను అమ్మకం జరిపి తిరిగివచ్చేవాళ్లట. అలా ఒకసారి వాళ్లు వెళ్లివస్తూ భోజనం చేయడానికి ఒక వ్యవసాయ బావి దగ్గర ఆగారట. ఆ సమయంలోనే ఆ బృందానికి చెందిన 'బంగారమ్మ' అనే బాలిక ఆ బావిలో పడి చనిపోతుంది.
వాళ్లంతా బాధపడుతుండగా ఆ బావిలో నుంచి ఒక దివ్యమైన తేజస్సు బయటికి వచ్చి, తాను చనిపోలేదనీ ఇకపై అమ్మవారిగా పూజలందుకోవడం కోసం ఆ దేహాన్ని విడిచి పెట్టానని అంటుంది. తాను కళ్ళేపల్లి లోని తమ వ్యవసాయ క్షేత్రంలో వెలుస్తున్నాననీ ... తనకి ఆలయాన్ని నిర్మించి భక్తులకి దర్శన భాగ్యం కలిగించమని చెబుతుంది.
అక్కడి నుంచి వచ్చిన వారికి నిజంగానే ఆ పొలంలో ఒకచోట బంగారమ్మను పోలిన ప్రతిమ కనిపిస్తుంది. దాంతో ఈ అయిదు కుటుంబాల వాళ్లు ఆమెకి ఆలయాన్ని నిర్మించి 'బంగారు మైసమ్మగా పూజించడం ప్రారంభిస్తారు. చెప్పుకున్న వెంటనే ఈ తల్లి బాధలను తీరుస్తుందనీ .. కోరిన వరాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
జిల్లాలోనే అతిపెద్ద మైసమ్మ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం 'మే' మాసంలో ఘనంగా జాతర నిర్వహిస్తుంటారు. లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. ప్రతియేటా పెరుగుతున్న భక్తులు ... ఆలయం యొక్క ఆదాయం, ఆ తల్లి మహిమలకు ... ఆమె పట్ల భక్తులకు గల విశ్వాసానికి నిదర్శనమై నిలుస్తోందని చెప్పవచ్చు .