పెరుమాళ్ సౌందర్యం అలాంటిది !

సప్త మోక్షపురాల్లో 'కంచి' ఒకటిగా దర్శనమిస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా, ఇక్కడ ఎటువైపు చూసినా ఆలయాలే కనిపిస్తూ వుంటాయి. 'విష్ణుకంచి'గా చెప్పబడుతోన్న ప్రదేశంలో 'వరదరాజన్ పెరుమాళ్ ' ఆలయం అలరారుతూ వుంటుంది. నూటా ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా వరదరాజన్ పెరుమాళ్ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది.

క్రీ.శ.పదో శతాబ్దం ద్వితీయార్థంలో ఈ ఆలయాన్ని చోళులు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడి గోపురాలు ... ప్రాకారాలు ... మంటపాలు అద్భుతమైన శిల్పకళను ఆవిష్కరిస్తూ వుంటాయి. ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబిస్తూ కనులను కట్టిపడేస్తుంటాయి. సౌందర్యమంటే ఇక్కడి వరదరాజన్ పెరుమాళ్ దేనని చెబుతుంటారు. స్వామి అంత చక్కగా నయనమనోహరంగా దర్శనమిస్తూ వుంటాడు.

ఆయనని దర్శించిన భక్తులు వెంటనే చూపుమళ్లించుకోలేరని అంటారు. ఆంగ్లేయ అధికారి అయిన 'రాబర్ట్ క్లైవ్' కూడా అలాంటి అనుభూతినే పొందినట్టుగా చెబుతుంటారు. కొంతమంది ఆంగ్లేయ అధికారులు ఇక్కడి దేవాలయాలను దర్శించి, వాళ్లు కూడా భక్తులుగా మారిపోయిన సందర్భాలు చాలానే వున్నాయి. అలాంటి ఆంగ్లేయ అధికారులలో రాబర్ట్ క్లైవ్ పేరు కూడా వినిపిస్తూ వుంటుంది.

మూడవ కర్ణాటక యుద్ధ సమయంలో ఆయన ఈ ప్రదేశానికి వచ్చాడట. ఇక్కడి పెరుమాళ్ ని దర్శించిన ఆయన, స్వామివారి సమ్మోహన సౌందర్యాన్ని తిలకిస్తూ కొంతసేపు అలాగే ఉండిపోయాడట. ఆ స్వామికి అలంకరించమంటూ అత్యంత ఖరీదైన ఒక 'పచ్చల హారం' సమర్పించాడట. ఆనాటి నుంచి ఇప్పటికీ ఉత్సవాల సమయంలో స్వామివారికి ఈ హారాన్ని అలంకరిస్తూ వుండటం విశేషం. ఇలా స్వామివారి సౌందర్యం ఎంతోమందిని మంత్రముగ్ధులను చేస్తూనే వుంటుంది. అనిర్వచనీయమైన అనుభూతిని అందజేస్తూనే వుంటుంది.


More Bhakti News