సూర్యదేవుడి అనుగ్రహాన్ని ఇలా పొందవచ్చట !

లోకంలోని చీకట్లను పారద్రోలుతూ వెలుగులు పంచే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడుగా భావించి ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. ఇంద్రాది దేవతలు ... మహర్షులు సూర్యుడికి నమస్కరించుకున్న తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలు ఆరంభిస్తూ వుంటారు.

ప్రకృతిని ప్రభావితం చేస్తూ ఆ ప్రకృతి ద్వారా జీవరాశికి కావలసిన ఆహారాన్ని అందించేది సూర్యుడే కనుక, ప్రాచీన కాలంలో అందరూ సూర్యుడిని ఆరాధించేవారు. సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమన్నట్టుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకునే వారు. ఆహారాన్ని ... ఆరోగ్యాన్ని అందించే దైవంగా ఆయన మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాడు.

అందువల్లనే ఈనాటికీ ఉదయాన్నే స్నానంచేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కరించేవాళ్లు ఎంతోమంది కనిపిస్తుంటారు. సూర్యుడికి నమస్కరించడం వలన అనేక దోషాలు తొలగిపోతాయనీ ... పుణ్యఫలాలు చేకూరతాయనేది ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. అలాంటి సూర్యభగవానుడి పూజలో కొన్ని రకాల పూలు విశిష్టమైన స్థానాన్ని కలిగి వున్నాయి.

సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన ఆ పూలతో అర్చించడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుందట. గులాబీలు .. జాజులు .. పొగడలు .. పున్నాగలు .. తామరలు .. సంపెంగలు .. గన్నేరులు .. మందారాలు సూర్యభగవానుడి పూజలో విశేషమైనటు వంటి స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఈ పూలతో సూర్యుడిని పూజించడం వలన ఆయన సంతృప్తి చెందుతాడనీ, ఆయన అనుగ్రహంతో విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News