దేనికైనా భగవంతుడి అనుగ్రహం వుండాలి
భగవంతుడు ఎవరికీ కూడా చెడు చేయడు ... అందరినీ తన బిడ్డల మాదిరిగానే చూసుకుంటూ వుంటాడు. సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తూ వుంటాడు. సాధారణమైన కోరికల నుంచి మోక్షం వరకూ ఎవరు కోరిన దానిని బట్టి వాళ్లని అనుగ్రహిస్తూ వుంటాడు.
అయితే అనుకోకుండా ఒక్కోసారి భగవంతుడు ఇచ్చిన అవకాశాలను చేజార్చుకోవడం జరుగుతూ వుంటుంది. అప్పుడు నిరాశతో కూలబడిపోయి దేనికైనా భగవంతుడి అనుగ్రహం వుండాలని అనుకోవడం జరుగుతూ వుంటుంది. పాండురంగడిని సేవించి తరించిన భక్తులలో తుకారామ్ ముందువరుసలో కనిపిస్తాడు. అనునిత్యం ఆ స్వామిని కీర్తిస్తూ ... సేవిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు.
తుకారామ్ స్వప్నంలో స్వామి కనిపించి తాను గరుడ వాహనం పంపుతున్నాననీ, అందులో తన సన్నిధికి చేరుకోమని చెబుతాడు. ఆ విషయాన్ని గురించి తుకారామ్ ... తన భార్య జిజియా దగ్గర ప్రస్తావిస్తాడు. వైకుంఠం నుంచి గరుడ వాహనం వస్తోందనీ, దాంట్లో సశరీరంగా తనని వచ్చేయమని స్వామి చెప్పాడని అంటాడు.
తాను భగవంతుడిని సేవించడంలో ఆమె పాత్ర ప్రధానమైనదని చెబుతాడు. కుటుంబ నిర్వహణను ఆమె స్వీకరించడం వల్లనే తన ఆరాధన ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిందని అంటాడు. అనేక కష్టాలను ఎదుర్కుంటూ తనకి సేవలను అందిస్తూ వచ్చిన తీరును ప్రశంసిస్తాడు. తాను పొందిన పుణ్యం ఏదైనా ఉందంటే అందులో సగభాగం ఆమెకే చెందుతుందని చెబుతాడు. అందువలన తనతో పాటు వైకుంఠానికి వచ్చేయమని అంటాడు.
ఆ మాటలను ఆమె తేలికగా తీసుకావడంతో, పాండురంగడి నామాన్ని స్మరిస్తూ తుకారామ్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంద్రాణి నదీ తీరానికి గరుడ వాహనం వచ్చిందనీ ... తుకారామ్ దాంట్లో వైకుంఠానికి వెళ్లిపోయాడనే కబురు జిజియాకి తెలుస్తుంది. భర్త మాటను భగవంతుడి ఆదేశంగా భావించలేక పోయినందుకు ... ఆయన అనుగ్రహాన్ని చేజార్చుకున్నందుకు బాధపడుతూ ఆమె అక్కడే కుప్పకూలిపోతుంది.