శనిదేవుడిని ఈ పూలతో పూజించాలి
జీవితంలో కష్టనష్టాలను సృష్టిస్తూ మానసికంగాను ... శారీరకంగాను వాటిని ఎదుర్కునేలా చేయడంలో శనిదేవుడు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాడు. అయితే ఆ బాధలను తట్టుకోవడం అంతతేలికైన విషయం కాదు. అందుకే ఎంతటివారైనా ఆయన పేరు వినడానికి కూడా భయపడిపోతుంటారు. ఎవరికి వాళ్లు ఆయన తమ జోలికి రాకుండా ఉండాలనే కోరుకుంటారు.
అయితే ఆయన మాత్రం తాను అనుకున్న పనిని తాపీగా పూర్తిచేసుకుంటూ వుంటాడు. తన అనుగ్రహాన్ని ఆశించిన వారిపై నుంచి తన ప్రభావాన్ని తగ్గిస్తూ వెళతాడు. శని దోషం బారిన పడినవాళ్లు ఆయనని శాంతింపజేసి ఆయన అనుగ్రహాన్ని పొందడం మినహా మరోమార్గం లేదు.
శని బారి నుంచి బయటపడి పూర్వస్థితికి చేరుకోవాలంటే, అది ఆయన కరుణాకటాక్షాలతోనే సాధ్యమవుతుంది. ఎంతోమంది రాజుల చరిత్రలు ఇందుకు ఉదాహరణగా కనిపిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో శని అనుగ్రహాన్ని పొందే వివిధ మార్గాలలో పూలు కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
దేవుడు ఒకడే అయినా వివిధ రూపాలుగా ఆయనని పూజించుకోవడం జరుగుతూ వుంటుంది. ఒక్కో దైవానికి ఒక్కోరకం పూలు ఇష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఆ పూలతో పూజించడం వలన ఆయా దైవాలు వెంటనే అనుగ్రహిస్తాయని అంటారు. అలాగే నవగ్రహాలలో కూడా ఒక్కో గ్రహానికి ఒక్కోరకం పూలు ఇష్టమైనవిగా కనిపిస్తుంటాయి.
అలా శనిదేవుడికి ఎరుపురంగు ... నీలం రంగు ... నలుపు రంగు పూలు ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. శనిత్రయోదశి రోజున ఈ పూలతో పూజించడం వలన ఆయన ప్రసన్నుడవుతాడట. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడు శనిదోష నివారణ జరిగిపోతుంది. విసిగిస్తూ వచ్చిన వివిధ రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.