ఈ స్తంభం నుంచే స్వామి అవతరించాడట !
అహోబిలం క్షేత్రాన్ని చూడగానే ఇది మహిమాన్వితమైనదనీ ... మహా శక్తిమంతమైనదని తెలిసిపోతూ వుంటుంది. నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం అడుగడుగునా అద్భుతాలను ఆవిష్కరిస్తూ కనిపిస్తుంది. అలాంటి అద్భుతాలలో ఒకటిగా ఇక్కడికి సమీపంలో 'ఉగ్రస్తంభం' దర్శనమిస్తుంది.
ఈ స్తంభం నుంచే నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించినట్టు స్థలపురాణం చెబుతోంది. హరినామాన్ని స్మరించడం మానుకోమని హిరణ్యకశిపుడు ఎన్నివిధాలుగా చెప్పినా ప్రహ్లాదుడు వినిపించుకోడు. ఆ విషయంగా ఇద్దరికీ వాదన జరుగుతూ వున్న సందర్భంలో, శ్రీహరి లేని చోటు లేదని చెబుతాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంనందు ఉన్నాడా ? అని హిరణ్యకశిపుడు అక్కడి స్తంభాన్ని చూపిస్తూ అడగ్గా, సందేహమేలేదని చెబుతాడు ప్రహ్లాదుడు.
దాంతో ఆయన తన 'గద'తో ఆ స్తంభాన్ని పగులగొడతాడు. భక్తుడి మాటను నిజం చేయడం కోసం శ్రీహరి ... నరసింహ అవతారంలో ఆ స్తంభం నుంచి వస్తాడు. లోక కల్యాణం కోసం హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ చేయబడిన ఈ ఘట్టం 'అహోబిలం'లో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా ఈ క్షేత్రానికి సమీపంలో గల ఒకకొండ రెండుగా చీలి కనిపిస్తూ వుంటుంది. ఈ చీలిక నుంచే నరసింహస్వామి బయటికి వచ్చినట్టుగా చెబుతుంటారు.
తన భక్తుడిని చిత్రహింసలకి గురిచేస్తూ ... తన సహనాన్ని పరీక్షించిన కారణంగా స్వామివారు ఉగ్రస్వరూపుడై ఈ స్తంభం నుంచి బయటికి వచ్చాడు. ఈ కారణంగానే రెండుగా చీలిన ఈ కొండభాగాన్ని 'ఉగ్రస్తంభం' అని పిలుస్తుంటారు. ఈ ఉగ్రస్తంభాన్ని చూస్తుంటే ... అద్భుతమైన ఆ ఘట్టం కనులముందు కదలాడుతుంది. భక్తుడి కోసం సంకల్పమాత్రంచేత భగవంతుడు ఆవిర్భవించిన ఆ ప్రదేశాన్ని దర్శించడం పూర్వజన్మ పుణ్యంగా అనిపిస్తుంది.