ముక్తిమార్గంలో ప్రయాణం
జీవుడు తల్లి గర్భంలో వున్నప్పుడు అనేక బాధలను అనుభవిస్తాడు. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తరువాత ప్రతి దశలోను అనేక కష్టాలు పడతాడు. ఎప్పటికప్పుడు పరిస్థితులు పగబట్టినట్టుగా అనిపిస్తూ ఉండటంతో, ఒకానొక దశలో పూర్తిగా విసిగిపోవడం జరుగుతుంది. భగవంతుడా ఇక నీను ఈ కష్టాలను భరించలేను .. ఇక నాకు ముక్తిని ప్రసాదించు అంటూ వేడుకోవడం జరుగుతుంది.
మోక్షాన్ని ప్రసాదించమని కోరుకోవడమంటే ... మళ్లీ జన్మంటూ లేకుండా చేయమని వేడుకోవడమే. అయితే అలాంటి మోక్షాన్ని పొందడం సామాన్యమానవుల వలన కాదని చాలామంది అనుకుంటూ వుంటారు. మోక్షం లభించాలంటే సన్యాసాన్ని స్వీకరించి, అడవులకు వెళ్లి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేసుకోవాలని అనుకుంటారు. అలా చేసినప్పుడే భగవంతుడు అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్పుకుంటారు.
నిజానికి పూర్వకాలంలో చాలామంది మహర్షులు ... మునులు గృహస్తులుగా వుండే భగవంతుడిని ఆరాధించారు. తమ కర్తవ్యాన్ని తాము నిర్వహిస్తూ ... తమ భాధ్యతలను తాము నెరవేరుస్తూ వచ్చారు. దైవానికి దూరం చేసే కోపతాపాలను వదిలి ... సాత్వికమైన ఆహారాన్ని మితంగా స్వీకరించారు. ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ... అతిథులను సేవిస్తూ ... భగవంతుడి నామస్మరణ చేస్తూ మోక్షాన్ని సాధించారు.
అందువలన మోక్షం అనగానే సన్యసించి అడవులకు వెళ్లి తపస్సు ద్వారా మాత్రమే సాధించేది అనే భావనను పక్కన పెట్టాలి. మోక్షాన్ని పొందడానికి ఎంతో పుణ్యరాశి అవసరమవుతుంది. అంతటి పుణ్యాన్ని గృహస్తులుగా వుండే సాధించవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. గృహస్తులుగా ఉంటూ .. ధర్మబద్ధంగా నడచుకుంటూ భగవంతుడి అనుగ్రహాన్ని పొందినవాళ్లను ఆదర్శంగా తీసుకోవాలి. ఆ మార్గంలో ప్రయాణిస్తూ మోక్షాన్ని సాధించుకోవాలి.