అరుదైన కృష్ణ విగ్రహం ఇక్కడ చూడొచ్చు
కృష్ణుడి లీలా విశేషాలను గురించి విని తరించని వాళ్లు వుండరు. అద్భుతంగా ఆయన ఆవిష్కరించిన లీలలను గురించి ఎంతగా విన్నా వినాలనిపిస్తూనే వుంటుంది. కమనీయమైన ఆ ఘట్టాలను తలచుకుంటూ వుంటే కాలం తెలియదు. ఎంతో మంది మహానుభావులు ఆయన లీలామృతాన్ని ఆస్వాదిస్తూ సమాధి స్థితిని పొందారు. మరెంతో మంది మహాభక్తులు ఆయనని ప్రత్యక్షంగా సేవించి తరించారు.
అలాంటి భక్తుల జాబితాలో 'హరిదాసు' ఒకరుగా కనిపిస్తాడు. క్రీ.శ.16 వ శతాబ్దానికి చెందినవాడైన హరిదాసు, సహజంగా సంగీత విద్వాంసుడు. కృష్ణుడి పట్ల ఆయనకి గల ప్రేమానురాగాలను గురించి అప్పట్లో అక్కడి వాళ్లంతా చెప్పుకునే వారు. అసమానమైన భక్తితో ఆయన చేసే మధురమైన గానానికి కృష్ణుడే పరవశించిపోయి ఆయనని అనుగ్రహించాడు.
ఒక రోజున కలలో ఆయనకి కృష్ణుడు కనిపించి ... ఫలానా చోటున తన ప్రతిమ ఉందనీ ... దానిని వెలికితీసి పూజించమని చెబుతాడు. ఆయన ఆదేశం ప్రకారం హరిదాసు ఆ విగ్రహం జాడ తెలుసుకుంటాడు. ఆ విగ్రహం శ్వాస తీసుకుంటున్నట్టు అనిపించడంతో, ఇక ఆయన దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదని భావిస్తాడు. సాక్షాత్తు కృష్ణుడు ఆ విగ్రహం యందు ఉన్నాడని విశ్వసించి ఆయనకి ఆలయాన్ని నిర్మిస్తాడు.
'బృందావనం'లోని బాంకే బిహారీ ఆలయంలో ఈ ప్రతిమను దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోకి అడుగుపెడితే ఆనందం కలుగుతుంది ... కృష్ణుడిని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు ... ఆ భాగ్యాన్ని తమకి కలగజేసిన హరిదాసుకు కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేరు.