సమస్యలను తొలగించే సదాశివుడి క్షేత్రం
భక్తులు పిలిచినదే తడవుగా పరమశివుడు పలుకుతాడు అనడానికి నిదర్శనంగా అనేక ప్రాంతాల్లో ఆయన క్షేత్రాలు దర్శనమిస్తూ వుంటాయి. దేవతలు .. మహర్షులు ... మహారాజులు ... మహాభక్తులు ... ఎవరు పిలిచినా ఆయన సాక్షాత్కరిస్తూ వచ్చాడు. వాళ్ల అభ్యర్థన మేరకు వివిధ ప్రదేశాల్లో ఆవిర్భవించాడు.
ఈ కారణంగానే కొండకోనల్లోను ... అడవీ ప్రదేశాలలోను ... నదీ తీరాల్లోను .. ఇలా అనేక ప్రదేశాల్లో శివలింగ రూపాలు దర్శనమిస్తూ వుంటాయి. అలా ఆవిర్భవించిన శివలింగ రూపాలకు రాజులు ఆలయాలను నిర్మించారు. ఆదిదేవుడిని తమ ఇష్టదైవంగా భావించి ఆరాధించారు. అలాంటి పరమశివుడి క్షేత్రం మనకి 'సత్రశాల'లో కనిపిస్తుంది.
నల్గొండ జిల్లా అడవిదేవుల పల్లి మండలం పరిధిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడి స్వామిని 'మల్లికార్జునుడు' పేరుతో కొలుస్తుంటారు. మహర్షులులచే పూజించబడినదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాన్ని పల్లవులు ... చోళులు ... చాళుక్యులు దర్శించి తరించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. బౌద్ధమతం ఉచ్ఛ స్థితిలో వున్న కాలంలోనే ఈ ప్రదేశం ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లినట్టు చరిత్ర చెబుతోంది.
ప్రాచీన వైభవానికి ప్రతీకగా ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనసు స్థిమితపడుతుంది. ఈ స్వామిని దర్శించడం వలన ఎలాంటి కష్టతరమైన సమస్యలైనా వెంటనే తొలగిపోతాయట. స్వామి అనుగ్రహం కారణంగా సంతోషకరమైన జీవితం లభిస్తుందని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు.