హనుమంతుడు ఇలా అనుగ్రహించాడట !
శిలని శిల్పంగా మలచడం అంత తేలికైన విషయం కాదు. అందునా ఒక్క చేత్తో ఆ పనిని చేయడం అసలు సాధ్యపడని విషయమని చెప్పవచ్చు. ఇక ఒక చెయ్యితో పాటు ఆ శిల్పికి ఒక కాలు ... ఒక కన్ను కూడా లేవని తెలిసినప్పుడు ఎవరైనా సరే ఆశ్చర్యపోవలసిందే. భగవంతుడి అనుగ్రహం కారణంగానే అది సాధ్యమవుతుందని అనుకోవలసిందే.
అలాంటి ఆశ్చర్యకరమైన సంఘటన చాలాకాలం క్రిందట గుంటూరు జిల్లా 'కోళ్ళూరు'లో జరిగింది. ఒకప్పుడు ఇదంతా అడవీప్రాంతగా ఉండేది. ఒక కన్ను ... కాలు ... చెయ్యిలేని ఒక వ్యక్తి ఇక్కడికి సమీపంలో గల ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడట. నిరంతరం అతను హనుమంతుడి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు.
ఆయన రాళ్లపై హనుమంతుడి రూపాన్ని చెక్కాలని అనుకునేవాడట. అందుకు తన శక్తి చాలకపోవడం వలన కన్నీళ్లు పెట్టుకుంటూ కాలాన్ని గడుపుతూ వుండేవాడు. అతని భక్తికి కరిగిపోయిన హనుమంతుడు ఒక రోజున ఆయన దగ్గరికి వస్తాడు. అతన్ని వెంటబెట్టుకుని ఒక రాయి దగ్గరికి తీసుకువెళ్లి దానిని తన రూపంగా మలచమని చెబుతాడు. స్వామి చెబుతూ వుండగా ఆయన అనుగ్రహంతో ఆ వ్యక్తి ఆ పనిని పూర్తిచేస్తాడు.
అతను మలిచిన ఆ విగ్రహమందు తాను ఉంటాననీ ... ఆ ప్రతిమ అశేష భక్తజనకోటిచే పూజించబడుతుందని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు. ఈ సంఘటన గురించి తెలిసిన వాళ్లంతా అక్కడే ఆయనని పూజించడం ప్రారంభిస్తారు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక దోష పరిహారార్థంగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హనుమంతుడి ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు.
అందుకు తగిన విగ్రహం ఫలానా చోట ఉందని ఆయనకి ఈ విగ్రహం గురించి తెలుస్తుంది. దాంతో ఈ విగ్రహం వున్న చోటునే ఆయన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మహిమాన్వితమైన ఈ సంఘటనకు వేదికగా నిలిచిన 'కోళ్ళూరు' ... పులిచింతల ప్రాజెక్టు కారణంగా ముంపుకి గురికానుండటంతో, ఇటీవల కాలంలో ఈ విగ్రహాన్ని 'బెల్లంకొండకి తరలించడం జరిగింది. ఈ తరలింపు కార్యక్రమంలోనూ స్వామి చూపిన మహిమ గురించే ఇక్కడ అంతా ఆసక్తిగా చెప్పుకుంటూ వుంటారు.