ఇక్కడి జంబూవృక్షం వెనుక కథ !
కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు ఆ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చి ఉంటుందనే సందేహం కలుగుతూ వుంటుంది. అలా పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న 'జంబుకేశ్వరం' గురించిన ఆలోచన చేసినప్పుడు, ఒక ఆసక్తికరమైన పురాణ కథనం వినిపిస్తూ వుంటుంది.
'శంభుడు' అనే మహర్షి నిరంతరం శివుడిని ధ్యానిస్తూ ఉండేవాడు. కాలం గడుస్తూ వున్నా కొద్దీ ఆయనకి ఆదిదేవుడితో అనుబంధం పెరుగుతూ వస్తుంది. ఎప్పటికీ తనకి పరమశివుడి ఎడబాటు కలగకూడదని అనుకుంటాడు. అనునిత్యం ఆయనని దర్శించే భాగ్యం ఎల్లవేళలా వుండాలని ఆశిస్తాడు.
మహాదేవుడిని గురించి తపస్సు చేసి తన మనసులోని మాటను ఆయనకి తెలియజేస్తాడు. తన భక్తుడు తన ఎడబాటును భరించలేకపోతున్నట్టుగా చెప్పడం, నిత్యం తన దర్శనభాగ్యం లభించేలా వరాన్ని కోరడం ఆయనకి పరమసంతోషాన్ని కలిగిస్తుంది. పవిత్రమైన ఆ ప్రదేశంలో ఆయన జంబూ వృక్షమై ఉండేలా శివుడు వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వృక్షానికి దగ్గరలో తాను ఆవిర్భవిస్తానని మాట ఇస్తాడు.
ఈ విధంగా చేయడం వలన తన దర్శనభాగ్యం ఆయనకి ఎప్పుడూ లభిస్తూ ఉంటుందని శివుడు చెబుతాడు. అందుకు సంతోషంగా అంగీకరించిన 'శంభుడు' అక్కడ జంబూ వృక్షంగా మారిపోతాడు. ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ ఈ వృక్షం కనిపిస్తూ వుంటుంది. జంబూ వృక్షంగా భక్తుడు ... ఆ భక్తుడి కోసం ఈశ్వరుడు కొలువై వున్న కారణంగా, ఈ క్షేత్రానికి 'జంబుకేశ్వరం' అనే పేరు వచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.