పిలిస్తే చాలు భగవంతుడు పలుకుతాడు
ఫలానా భక్తుడు పిలవగానే భగవంతుడు పరిగెత్తుకు వచ్చాడట ... ఆ భక్తుడి కోరిక మేరకే ఆ స్వామి ఇక్కడ వెలిశాడు. అని ఆయా క్షేత్రాలకి వెళ్లినప్పుడు అక్కడి క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకుని చెప్పుకుంటూ వుంటారు. మహాభక్తుడు కనుక ఆయన పిలవగానే స్వామి వచ్చి ఉంటాడని అనుకుంటూ వుంటారు.
కానీ నిజానికి తన నామాన్ని ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో పలికినా క్షణాల్లో స్వామి అక్కడ ఉంటాడనటానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి. ఆర్తితో ఆ దేవదేవుడిని పిలిస్తే చాలు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో వున్నా రక్షించడానికి వస్తూనే వుంటాడు. భగవంతుడి పట్ల అపారమైన భక్తి ... అసమానమైన విశ్వాసం వున్నప్పుడు ఆ స్వామి తప్పక వచ్చితీరతాడు.
ఎప్పటిలానే ఒకసారి నారదమహర్షి ... శ్రీమన్నారాయణుడిని కలుసుకుంటాడు. తన కంటపడిన కొన్ని విశేషాలను నారద మహర్షి వివరిస్తూ ఉండగా, శ్రీమన్నారాయణుడు ఆసక్తిగా వింటూ వుంటాడు. అలా వింటూనే హఠాత్తుగా అక్కడి నుంచి ఆయన అదృశ్యమైపోతాడు. ఆయన ఎక్కడికి వెళ్లాడా అని నారద మహర్షి ఆలోచిస్తూ ఉండగానే స్వామి తిరిగి వచ్చేస్తాడు.
నారదమహర్షి కుతూహలాన్ని ఆపుకోలేక .. ఎక్కడికి వెళ్లి వచ్చారు స్వామి అంటూ అడుగుతాడు. భూలోకంలో ఒక వ్యక్తి ఆకలి బాధను తట్టుకోలేక 'నారాయణా ' అంటూ కుప్పకూలిపోయాడనీ, అతణ్ణి ఆదుకోవడానికి వెళ్లానని స్వామి చెబుతాడు. ఈ సంఘటనను బట్టి పరమాత్ముడు ఎంత దయామయుడో ... ఎంతటి కరుణామయుడో తెలుసుకోవచ్చు. భగవంతుడి నామస్మరణకి గల శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
భగవంతుడి కరుణా కటాక్షాలు పొందాలంటే కృతయుగానికి 'తపస్సు' .. త్రేతాయుగానికి 'యజ్ఞయాగాలు' .. ద్వాపర యుగానికి 'దానధర్మాలు' .. కలియుగానికి 'నామస్మరణం' చెప్పబడింది. అందువలన భగవంతుడి మనసు గెలుచుకోవడానికీ ... ఆయన అనుగ్రహాన్ని పొందడానికి నామస్మరణకి మించిన ఆయుధం లేదని చెప్పబడుతోంది. అందుకే ఎల్లప్పుడూ భగవంతుడి నామాన్ని స్మరిస్తూ వుండాలి ... ఆ స్వామి సేవలో తరిస్తూ వుండాలి.