శని దోష ప్రభావం ఇలా తగ్గుతుందట !
జీవితం సంతోషంగా ... సాఫీగా సాగిపోవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇతరుల కష్టనష్టాలను చూసి అలాంటి పరిస్థితి తమకి రాకూడదని కోరుకుంటూ వుంటారు. అలాంటి వాళ్లు తాము శనిదోషం బారిన పడ్డామని తెలిస్తే తీవ్రమైన ఆందోళనకి లోనవుతుంటారు. శని ఎన్ని ఆటంకాలను సృష్టిస్తాడో, అవమానాలను కలిగిస్తాడో తెలిసి వుండటం వలన మరింత కంగారుపడిపోతుంటారు.
శని బారి నుంచి బయటపడటానికి ఇతరుల సహాలు తీసుకుని ఆ ప్రకారం శాంతి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చాలామంది ఆధ్యాత్మిక గ్రంధాల సూచనలను కూడా పాటిస్తూ వుంటారు. శని దోష ప్రభావం నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక గ్రంధాలు సూచించే మార్గాలలో ఒకటిగా హనుమంతుడిని ఆరాధించడమనేది కనిపిస్తుంది.
ప్రతి 'శనివారం' రోజున హనుమంతుడిని పూజించడం వలన శని ప్రభావం తగ్గుతుందట. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి ఆ స్వామికి ఇష్టమైన లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలని చెప్పబడుతోంది. ఇదే రోజున ముందుగా ఒక సంఖ్య అనుకుని అన్ని మార్లు 'హనుమాన్ చాలీసా' ను చదువుకోవాలని స్పష్టం చేయబడుతోంది.
పూజ అనంతరం తమని శని దోషం నుంచి కాపాడమని హనుమంతుడిని కోరుకోవలసి వుంటుంది. ఉదయాన్నే తలస్నానం చేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ నియమాలను పాటిస్తూ హనుమంతుడిని ఆరాధించాలి. ఈ విధంగా చేయడం వలన శని ప్రభావం తగ్గుతుందని చెప్పబడుతోంది.