బాబా పట్ల ఆయన విశ్వాసం అపారం !
బాబా శిరిడీకి వచ్చిన తొలిరోజుల్లో కొంతమంది ఆయనని పిచ్చి ఫకీరుగా భావించేవాళ్లు. కొంతమంది తోచినది పెట్టేవాళ్లు ... మరికొంతమంది ఆయనని పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. అయితే తనని ఇతరులు గుర్తించాలని బాబా ఎప్పుడూ అనుకోలేదు.
భిక్ష ద్వారా తనకి లభించిన ఆహారాన్ని మూగజీవులకు పెట్టి, మిగిలినది తాను స్వీకరించేవాడు. పొద్దుగూకగానే మశీదుకి తిరిగి వచ్చి తలదాచుకునేవాడు. మశీదులో 'ధుని' వెలిగించి ... వివిధ రకాల వ్యాధులకు విభూతిని మందుగా ఇచ్చేవాడు. ఆ విభూతి తిరుగులేని మందుగా పనిచేస్తూ ఉండటంతో, బాబా పట్ల అక్కడివారికి విశ్వాసం పెరగసాగింది.
బాబాని నమ్మిన కారణంగా ఆపదల నుంచి బయటపడేవారి సంఖ్య కూడా పెరగసాగింది. ఈ నేపథ్యంలో బాబాకి కొంతమంది అత్యంత సన్నిహితులుగా మారిపోయారు. అలాంటి వాళ్లలో 'శ్యామ' ఒకడుగా కనిపిస్తాడు. అందరూ అనుకుంటున్నట్టుగా బాబా పిచ్చివాడు కాదనీ, ఆయన దైవాంశసంభూతుడని శ్యామ ముందుగానే గ్రహిస్తాడు. బాబా విషయంలో భాటేలాంటి వారిని సైతం ఎదిరిస్తాడు.
ఒకసారి ఆయన పనిమీద పొరుగూరు వెళ్లివస్తూ, ఒక చెరువుగట్టుపై బాబా కూర్చుని ఉండటం చూస్తాడు. బాబా వివిధ భాషల్లో తనలో తాను మాట్లాడుకోవడం వింటాడు. తాను ఊహించినట్టుగానే బాబా సాధారణమైన ఫకీరు కాదని నిర్ధారణ చేసుకుంటాడు. బాబాని సేవిస్తూ ఆయన సన్నిధిలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు.