ఫలితాన్ని ప్రసాదించే పల్లకీ సేవ
ప్రతి పుణ్యక్షేత్రంలోను ప్రధాన దైవానికి వివిధ రకాల వాహన సేవలను నిర్వహిస్తూ వుంటారు. వీటిలో ఒక్కోసేవ ఒక్కో ప్రత్యేకతను ... విశేషాన్ని సంతరించుకుని వుంటాయి. ఈ సేవలను చూడటం వల్లనే పాపాలు నశించిపోతుంటాయి. ఈ కారణంగానే ఆయా క్షేత్రాల్లో జరిగే వాహన సేవలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటూ వుంటారు.
ఒక్కోవాహన సేవను భగవంతుడికి చేయించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తూ వుంటుంది. అందువల ఆయా సమస్యలతో సతమతమవుతోన్న వాళ్లు, వాటి బారి నుంచి బయటపడితే ఫలానా సేవను చేయిస్తామని మొక్కుకుంటూ వుంటారు. ఇలా ప్రత్యేకంగా భక్తుల మొక్కుబడి తీర్చడం కోసం కొన్ని రకాల సేవలను నిర్వహించే క్షేత్రాలు కూడా మనకి కనిపిస్తుంటాయి.
అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా ఖమ్మం జిల్లా - 'ముదిగొండ' కనిపిస్తుంది. ఇక్కడి కొండపై గుహలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించడం జరిగింది. పర్వదినాల సమయంలో స్వామివారికి వివిధ వాహన సేవలను ఘనంగా జరుపుతుంటారు. అలాగే ప్రతి శనివారం స్వామివారికి 'పల్లకీసేవ' ను నిర్వహిస్తుంటారు.
ఈ పల్లకీసేవ మహిమాన్వితమైనదనీ ... దీనికి ఎంతో ప్రత్యేకత వుందని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. ఎలాంటి కష్టాల్లో వున్నా ... బాధల్లో వున్నా స్వామివారికి పల్లకీసేవను జరిపిస్తామని మొక్కుకుంటే చాలు, అవన్నీ కూడా మబ్బుతెరల్లా తొలగిపోతాయట. అలా స్వామి అనుగ్రహం కారణంగా గండాల నుంచి బయటపడిన వాళ్లు 'శనివారం' పల్లకీసేవ మొక్కును చెల్లించుకుంటూ వుంటారు. ప్రతి శనివారం ఇక్కడ పల్లకీ సేవ జరుగుతూ వుండటం ... స్వామి మహిమను చాటుతూ వుంటుంది.