ఈ క్షేత్రానికి పేరు ఇలా వచ్చిందట !

వివిధ పుణ్యక్షేత్రాలను పరిశీలిస్తే అక్కడి భగవంతుడిని బట్టి, ఆ స్వామిని అక్కడికి రప్పించిన భక్తుడిని బట్టి కొన్ని క్షేత్రాలకు ఆయా పేర్లు వచ్చినట్టుగా అర్థమవుతూ వుంటుంది. అలాంటి క్షేత్రాల జాబితాలో మనకి 'బూరుగు గడ్డ' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది.

ప్రాచీనకాలం నాటి అనేక దేవాలయాల సమాహారంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఆదివరాహస్వామి ... లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు మూర్తులుగా ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో, క్రీ.శ.14 వ శతాబ్దంలో వెలుగు చూసిన ఇరవైనాలుగు అడుగుల 'అనంతపద్మనాభస్వామి' కూడా ఇక్కడ కనిపిస్తుంటాడు.

రెండివేల యేళ్లనాటి అనంతపద్మనాభస్వామి మూర్తిని చూస్తే ఎవరికైనా ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రానికి 'బూరుగు గడ్డ' అనే పేరు ఎలా వచ్చిందనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. పూర్వం ఇక్కడి ఎత్తైన ప్రదేశంలో 'భ్రుగుమహర్షి' తపస్సు చేసుకున్నాడట.

అందువలన అప్పట్లో ఈ ప్రదేశాన్ని 'భ్రుగుగడ్డ' అని పిలుచుకునే వాళ్లట. ఎత్తుగా కనిపించే ప్రదేశాన్ని గడ్డ ... గట్టు అని పిలవడం ఈ ప్రాంతంలో ఇప్పటికీ కనిపిస్తుంది. కాలక్రమంలో అది బూరుగు గడ్డగా మారిపోయిందని చెబుతుంటారు. పురాణపరమైన ... చారిత్రక పరమైన నేపథ్యాన్ని కలిగిన ఈ క్షేత్రాన్ని చూసితీరవలసిందే.


More Bhakti News