ఇది పరమశివుడి ఆజ్ఞట !

సాధారణంగా శివుడు ... పార్వతీ సమేతుడై పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. చాలా అరుదైన క్షేత్రల్లోనే ఆయన పార్వతీదేవితో పాటు గంగాదేవి సమేతంగా కూడా దర్శనమిస్తూ వుంటాడు. అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఒకటిగా విశాఖపట్నం జిల్లా 'చోడవరం' అలరారుతోంది.

గంగా .. గౌరీ సమేతంగా కొలువైన ఇక్కడి శివుడి వెనుక పురాణపరమైన నేపథ్యం ... చారిత్రక పరమైన వైభవం కనిపిస్తుంది. ఇక్కడి శివలింగం శిధిలావస్థలో కనిపిస్తూ వుంటుంది. అయినా భక్తులు ఆ శివలింగానికే పూజాభిషేకాలు జరుపుతుంటారు. అయితే ఇక్కడి శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయలేక ఊరుకోవడం కాదు. ఎలా ఉన్నదానిని అలా దర్శించుకోమని ఆ శివుడే ఆజ్ఞాపించాడని చెబుతుంటారు.

ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన స్వామి ... ఒకప్పుడు చోళరాజుకి స్వప్న దర్శనమిచ్చి తన జాడను తెలియజేయడం జరిగింది. స్వామి ఆదేశం మేరకు ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని నిర్మించాడు. కొంతకాలం తరువాత తురుష్కుల దాడిలో ఇక్కడి శివాలయం ... శివలింగం దెబ్బతిన్నాయి. తురుష్కులపై విజయం సాధించిన చోళరాజు, ఆలయాన్ని పునరుద్ధరించాలని అనుకున్నాడట.

అయితే శివలింగాన్ని కదిలించవద్దనీ ... దానిని అలాగే వుంచి పూజించుకోమని ఆ సదాశివుడే ఆయనకి కలలో కనిపించి చెప్పాడట. దాంతో ఆయన పరమశివుడి ఆజ్ఞను పాటిస్తూ రావడమే కాకుండా, దానిని తరువాత తరాలవారికి తెలియపరిచాడు. ఈ కారణంగానే ఈ రోజుకీ కూడా ఇక్కడి శిధిలావస్థలో వున్న శివలింగానికే పూజలు జరుపుతుంటారు. మహిమ గల ఇక్కడి మహాశివుడి కారణంగానే తామంతా సిరిసంపదలతో ... సుఖ శాంతులతో జీవిస్తున్నామని స్థానికులు చెబుతుంటారు. అంకితభావంతో ఆరాధిస్తూ పునీతులవుతుంటారు.


More Bhakti News