భగవంతుడే భక్తులను రక్షించుకుంటాడు
అనునిత్యం ... అనుక్షణం భగవంతుడిని స్మరిస్తూ తరించిన భక్తులు ఎంతోమంది వున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయకుండా భగవంతుడిని విశ్వసిస్తూ ఆయన చూపిన మార్గంలో వాళ్లు ప్రయాణించారు. అలాంటి భక్తి శిఖామణులలో 'తిరుజ్ఞాన సంబంధర్' ఒకడుగా కనిపిస్తుంటాడు. అసమానమైన శివభక్తితో అనేక ప్రాంతాలను ఆయన ప్రభావితం చేశాడు.
ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన పాండ్యదేశానికి చేరుకుంటాడు. అక్కడి రాజు మనసును ఇతర మతపెద్దలు మార్చేశారని తెలుసుకుంటాడు. తాను మతం మారడమే కాకుండా తన ప్రజలను కూడా రాజు ఆ దిశగా ప్రోత్సాహిస్తున్నాడనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. రాజు భ్రమను తొలగించాలనీ ... తిరిగి ఆయనని శైవం వైపుకి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు.
నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన పని . రాజు ఎలా స్పందిస్తాడో ... దాని పర్యవసానం ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు. తోటి వాళ్లు వారిస్తున్నా వినిపించుకోకుండా సంబంధర్ రంగంలోకి దిగుతాడు. ఈ విషయం తెలుసుకున్న మరో మత నాయకులు ఆయన రాజుని కలుసుకోనీయకుండా ఎన్నో కుటిల ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల నుంచి ఆ భగవంతుడే ఆయనని రక్షించుకుంటూ వెళతాడు.
ఆ స్వామి అనుగ్రహంతోనే ఆయన రాజుని కలుసుకుంటాడు. రాజు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ధైర్యంగా చెబుతాడు. శివానుగ్రహమే అందరినీ కాపాడుతుందని చెప్పి, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోన్న రాజుకి ఆ వ్యాధి నుంచి విముక్తిని కలిగిస్తాడు. దాంతో రాజుకి జ్ఞానోదయమై తన మనసు మార్చుకుని శివ భక్తుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు.