ఇక్కడి హనుమంతుడి ప్రత్యేకత ఇది !
భగవంతుడికీ ... భక్తులకి మధ్య విడదీయరాని అనుబంధం వుంటుంది. తమ దైవాన్ని విడిచి వెళ్లడానికి వాళ్ల మనసు అంగీకరించదు. ఇక ఆ దేవుడే తమతో పాటు వస్తే వాళ్ల ఆనందానికి హద్దు వుండదు. 'బెల్లంకొండ' మండల కేంద్రంలో కొలువైన ప్రసన్నాంజనేయుడి విషయంలో ఇదే జరిగింది.
గుంటూరు జిల్లా పరిధిలో గల బెల్లంకొండకి ... 'కోళ్ళూరు' నుంచి కొంతకాలం క్రితం హనుమంతుడు తరలివచ్చాడు. పులిచింతల ప్రాజెక్టు కారణంగా ముంపుకి గురయ్యే గ్రామాల్లో ఈ గ్రామం వుండటం వలన ఇక్కడి ప్రజలతో పాటు హనుమంతుడు కూడా తరలించబడ్డాడు.
కొంతకాలం క్రితం వరకూ ఈ హనుమంతుడు ... చల్లపల్లి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కోళ్ళూరులో నిర్మించిన ఆలయంలో కొలువై భక్తులకు దర్శనమిస్తూ వచ్చాడు. ఒకానొక దోష పరిహారార్థం ఆయన ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఒక కన్ను .. ఒక కాలు .. ఒక చెయ్యి కలిగిన వ్యక్తి, సాక్షాత్తు హనుమంతుడి ఆదేశంతో ఈ విగ్రహాన్ని మలిచినట్టు చెప్పుకుంటూ వుంటారు.
ఇక్కడ హనుమంతుడు చేసిన మహిమలు అన్నీ ఇన్నీకావు. ఆయనని దర్శించుకుంటే జరగని కార్యంకానీ ... లభించని విజయం కాని లేదని భక్తులు చెబుతుంటారు. అలా ఆయన అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందిన ఒక భక్తుడే, బెల్లంకొండ సమీపంలో స్వామివారికి ఆలయ నిర్మాణాన్ని తలపెట్టడం జరిగింది. స్వామివారి మహిమలను గురించి తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆయనని దర్శిస్తున్నారు. తమ ప్రాంతానికి తరలివచ్చిన హనుమంతుడికి ఆప్యాయంగా సేవలను అందిస్తున్నారు.