ఈ క్షేత్రంలో అడుగుపెడితే చాలు !
సాధారణంగా వివాహమైన కొంతకాలానికి సంతానం కలగకపోతే ఆ దంపతులు తీవ్రమైన ఆందోళనకి లోనవుతుంటారు. తమ మనోభీష్టం నెరవేర్చమని కోరుతూ వివిధ క్షేత్రాలను దర్శిస్తూ వుంటారు. సంతానాన్ని అనుగ్రహించే దైవాలుగా సంతాన నాగేంద్రస్వామినీ ... సంతాన వేణుగోపాలస్వామిని విశ్వసిస్తూ వుంటారు. ఈ రెండింటిలో తమకి అందుబాటులో గల ఏదో ఒక ఆలయాన్ని దర్శించుకుంటూ వుంటారు.
ఈ రెండు ఆలయాలు అందుబాటులో ఉన్న క్షేత్రంగా 'బూరుగు గడ్డ' కనిపిస్తూ వుంటుంది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడి ప్రధాన దైవం 'ఆదివరాహ లక్ష్మీ నరసింహస్వామి' గా చెప్పబడుతున్నాడు. ఒకే గర్భాలయంలో ఆదివరాహస్వామి ... లక్ష్మీ నరసింహస్వామి ... వేణుగోపాలుడు కొలువుదీరి వుండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.
సంతానం కోసం ఈ వేణుగోపాలుడిని దర్శించిన తరువాత, ఆ కోరిక నెరవేరని వాళ్లంటూ వుండరని స్థానికులు చెబుతుంటారు. ఇక ఇక్కడి రామలింగేశ్వరుడి సమీపంలో గల సంతాన నాగేంద్రుడు కూడా మహిమాన్వితుడని చెబుతుంటారు. ఇక్కడ చెల్లించుకుంటోన్న మొక్కులే అందుకు నిదర్శనమని చెబుతుంటారు.
పురాణపరమైన ... చారిత్రక పరమైన నేపథ్యం కలిగిన ఈ క్షేత్రంలో అడుగుపెడితే ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అలాంటి ఈ క్షేత్రంలో సంతానాన్ని అనుగ్రహించే వేణుగోపాలుడు ... నాగేంద్రుడు అందుబాటులో ఉండటం పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు.