ఇక్కడి శివుడిని స్త్రీగా అలంకరిస్తారు !

లోక కల్యాణం కోసం పరమశివుడు అనేక ప్రాంతాల్లో లింగరూపంలో ఆవిర్భవించాడు. శివలింగానికి విభూతి ధారణ చేసి ... త్రినేత్రం ... మీసాలు పెట్టి పూజించడం మనకి అనేక క్షేత్రాల్లో కనిపిస్తూ వుంటుంది. అలాంటి ఆదిదేవుడిని రాత్రి సమయంలో ఒక క్షేత్రంలో స్త్రీగా అలంకరిస్తుంటారు.

బృందావనం - 'బడే కుంజ్' లో గల 'గోపీశ్వర ఆలయం' లో శివుడు ఇలా శ్రీ వేష ధారియై దర్శనమిస్తూ వుంటాడు. ఆదిదేవుడుని ఇక్కడ ఇలా అలంకరించడానికి వెనుక ఓ ఆసక్తికరమైన కథ వినిపిస్తూ వుంటుంది. ఒకసారి బృందావనంలో గోపికలతో కలిసి గోపాలుడు ఆడిపాడుతూ వుండటం శివుడు చూస్తాడు.

తాను కూడా ఒక గోపికలా మారిపోయి కృష్ణుడితో కలిసి ఆడాలని ముచ్చటపడతాడు. అందమైన గోపికగా వేషం కట్టి అక్కడి గోపికలతో కలిసిపోయి కృష్ణుడితో కలిసి నాట్యమాడసాగాడు. తమకన్నా అందంగా వున్న కొత్త గోపిక ఎవరా అని మిగతా గోపికలు ఆశ్చర్యపోతారు ... అసూయపడతారు.

ఆ సమయంలోనే ఆయన మేలిముసుగు జారిపోవడంతో వచ్చినది శివుడనే విషయం అందరికీ తెలిసిపోతుంది. దాంతో ఆయన అక్కడే ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుంచి అపురూపమైన ఈ సంఘటనకి గుర్తుగా ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి వేళలో శివుడిని స్త్రీగా అలంకరించి పూజిస్తూ వుంటారు. మహాదేవుడి ముచ్చట తీరుస్తూ మురిసిపోతుంటారు ... ఆయన సన్నిధిలో పరవశించిపోతుంటారు.


More Bhakti News