భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చు

ఆపదలో చిక్కుకున్నప్పుడు ... తమని గట్టెక్కించమని భగవంతుడిని కోరుకోవడం జరుగుతూ వుంటుంది. అలాంటప్పుడు ఎవరో ఒకరు వచ్చి తమకి తోచిన సాయాన్ని అందిస్తే, భగవంతుడే ఆ రూపంలో వచ్చాడని అనుకోవడం జరుగుతూ వుంటుంది. అంటే తాము విశ్వసించే దైవం ఏదో ఒక రూపంలో వచ్చి తమని ఆదుకుంటుందని అంతా భావిస్తుంటారు.

ఆధ్యాత్మిక గ్రంధాలను పరిశీలిస్తే, తనని నమ్మిన భక్తుల కోసం స్వామి అనేక అవతారాలను ... రూపాలను ధరించిన విషయం స్పష్టమవుతూ వుంటుంది. సాధారణ భక్తులనే అనుగ్రహించే ఆ దేవదేవుడు, మహాభక్తులు పిలిస్తే పలకకుండా ఉంటాడా ? ... వాళ్ల మాటలను నిజం చేయకుండగా ఉంటాడా ? ఇదే విషయం మనకి 'కనకదాసు' విషయంలోనూ స్పష్టమవుతుంది.

వ్యాసరాయల వారి ఆశ్రమంలో కనకదాసు వున్న రోజుల్లో, ఆయన పట్ల కొంతమంది అసూయ ద్వేషాలను పెంచుకుంటారు. ఆయనని ఎద్దేవా చేయడం కోసం దేవుడిని పిలవమంటూ ఒత్తిడి చేస్తారు. దాంతో దైవాన్ని ఆహ్వానిస్తానంటూ ధ్యానంలోకి వెళ్లిన కనకదాసు, రెండు మూడు రోజుల తరువాత ఆ ధ్యానంలో నుంచి బయటికి వస్తాడు. దేవుడు రాలేదనీ ... ఎప్పుడూ లేనిది ఆశ్రమంలోకి కొన్ని మూగజీవాలు మాత్రం వచ్చివెళ్లాయని వాళ్లంతా ఆయనని ఆటపట్టించబోతారు.

ఆ రూపాల్లో వచ్చింది భగవంతుడేననీ, ఆయన తత్త్వాన్ని తెలుసుకున్నవారు మాత్రమే ఆయనని గుర్తించగలరని చెబుతాడు కనకదాసు. ఆదుకునే సందర్భాల్లోనూ ... అజ్ఞానులను మేల్కొలిపే సమయాల్లోను భగవంతుడు వివిధ రూపాలను ధరిస్తాడని అంటాడు. ఆయన మాటలను వ్యాసరాయలవారు సమర్థించడంతో, వాళ్లంతా కూడా తమ అజ్ఞానానికి బాధపడుతూ మన్నించవలసిందిగా కనకదాసును కోరతారు.


More Bhakti News