భక్తుడి కోసం వచ్చిన భగవంతుడు
భగవంతుడు తాను ఎక్కడ కొలువైనా ... తన భక్తులు తనకి ఎంత దూరంలో వున్నా వాళ్లని ఆయన కనిపెట్టుకునే వుంటాడు. వాళ్ల కష్ట నష్టాలు తెలుసుకుంటూ అడుగడుగునా ఆదుకుంటూనే వుంటాడు. తన దర్శనం కోసం వాళ్లు వస్తారని ఎదురుచూస్తాడు. వాళ్లు రాలేని స్థితిలో వున్నప్పుడు తానే వాళ్ల దగ్గరికి వెళతాడు.
అలా భక్తుడిని వెతుక్కుంటూ భగవంతుడు వెళ్లి వెలసిన క్షేత్రాలు ఎన్నో మనకి కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'ముదిగొండ' శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా పరిధిలో గల ప్రాచీన క్షేత్రాల జాబితాలో ఇది ముందువరుసలో కనిపిస్తుంది.
వయసు పైబడిన కారణంగా తన కోసం రాలేకపోయిన ఒక భక్తుడి కోసం స్వామివారు ఇక్కడి వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. స్వప్నంలో ఆ స్వామి కనిపించి తాను ఇక్కడి కొండపై గల గుహలో వెలసినట్టుగా చెప్పడంతో, ఆ భక్తుడు లేని ఓపికను తెచ్చుకుని వెళ్లి చూడగా ఆయన ఇక్కడి కొండగుహలో దర్శనమిచ్చాడు.
ఈ గుహ చాలా చీకటిగా వుంటుంది. అయితే కొండరాళ్ల సందుల్లో నుంచి ఒకే ఒక చోటు నుంచి సూర్య కిరణాలు లోపలికి ప్రసరిస్తూ వుంటాయి. స్వామివారి రూపం కనిపించడం కోసమేనన్నట్టుగా ఆయన వరకే ఆ వెలుగు ప్రసరిస్తూ వుంటుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసినవాళ్లు ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. మహిమగల ఇక్కడి నరసింహుడిని దర్శించుకోవడం వలన మనోభీష్టాలు నెరవేరతాయని చెప్పబడుతోంది.