లక్ష్మీదేవి మనసును ఇలా గెలుచుకోవచ్చట
ఎవరైనా తమ మనసుకి నచ్చిన ప్రదేశాలను చూసినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతారు. కొంతకాలం పాటు అక్కడ వుంటే బాగుండునని అనుకుంటారు. ఇక తమ మనసుకి నచ్చని ప్రదేశం నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్టుగా చూస్తుంటారు. ఇంచుమించు లక్ష్మీదేవి కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నట్టుగా కనిపిస్తూ వుంటుంది.
ఏ కుటుంబంలోని వాళ్లు పవిత్రతను ... ప్రశాంతతను కలిగి వుంటారో, తల్లిదండ్రులను ప్రేమిస్తూ వుంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతూ వుంటుందట. ఇక ఎప్పుడు చూసినా గొడవలే జరుగుతూ వుంటే, సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి ఆమె బయటపడిపోతుందట.
భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలను కలిగి ఉంటూ, సమస్యలను సహనంతో పరిష్కరించుకుంటూ వుంటే లక్ష్మీదేవి వాళ్లకి తన సహకారాన్ని అందిస్తుందట. ఇక వాళ్లు తమ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటూ వుంటే, మరింత సంతోషపడిపోయి వాళ్లను కటాక్షిస్తుంది. తాను స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కొన్ని రకాల ఇబ్బందులు వున్నా, తల్లిదండ్రులను ప్రేమించే వారి ఇంట ఉండటం కోసం లక్ష్మీదేవి సర్దుకుపోతుందట.
ఇక తాము గొడవలు పడటమే కాకుండా ... తల్లిదండ్రులను పట్టించుకోని వారి ఇంట ఆమె క్షణకాలమైనా నిలవకుండా వెళ్లిపోతుంది. తమ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోకూడదనీ, దారిద్ర్య బాధలు తమ దరి చేరకూడదనే అంతా అనుకుంటూ వుంటారు. అలాంటి వాళ్లంతా ఆ తల్లికి నచ్చేవిధంగా నడచుకోవాలనే విషయాన్ని మరిచిపోకూడదు.