ఈ రోజున గౌరీదేవిని పూజించాలి
పెళ్లీడు వచ్చిన ఏ ఆడపిల్ల అయినా తనకి భర్తగా రాబోయేవాడు మంచి గుణవంతుడు కావాలని కోరుకుంటుంది. తన అలవాట్లను ... అభిరుచులను గురించి తెలుసుకుని, తన మనసుకి కష్టం కలగకుండా చూసుకోవాలని ఆశపడుతుంది. తన భర్తను చూసి తాను అదృష్టవంతురాలినని అంతా అనుకోవాలనీ, తమని చూసి సరైన జంట అని చెప్పుకోవాలని అనుకుంటుంది.
విద్యావంతుడు ... ప్రతిభావంతుడు ... సంస్కారవంతుడు ఇలా అనేక మంచిలక్షణాలు కలిగిన యువకుడు తనకి భర్తగా లభించాలని ఆడపిల్లలు ఆశిస్తుంటారు. మంచి ఉద్యోగం ... కుదురైన ఇల్లు ... తీరైన సంసారం ... చక్కని సంతానం ... ఇలా అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ వుంటారు. ఆ కలలు ... నిజం కావాలంటే అందుకు 'గౌరీదేవి' అనుగ్రహం కావాలని పెద్దలు చెబుతుంటారు. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడం కోసం చేసే పండుగ 'ఉండ్రాళ్ల తద్ది' అని అంటూ వుంటారు.
భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ల తద్దిగా చెబుతుంటారు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... పూజామందిరంలో గల గౌరీదేవిని అలంకరించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తూ ... పదహారు ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించవలసి వుంటుంది. ఆ ఉండ్రాళ్లను భోజనానికి ముందు ప్రసాదంగా స్వీకరించాలి.
ఆ తరువాత గోంగూరపచ్చడి ... ఉల్లిపాయలతో కూడిన సాంబారు ... పెరుగుతో భోజనం చేయవలసి వుంటుంది. తోటి కన్నెపిల్లలతో కలిసి ఆనాటి సాయంత్రం ఊయలను ఊగవలసి వుంటుంది. ఈ విధంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకోవడం వలన, మనసుకు తగినవాడు భర్తగా లభించి, వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగుతుందని చెప్పబడుతోంది.