నిరంతర సాధనే విజయాన్నిస్తుంది

సమాజంలో ఎవరి జీవితాన్ని వాళ్లు కొనసాగిస్తూ ... ఇతరుల జీవితాలను కూడా గమనిస్తుంటారు. ఇతరుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఆచరించేవాళ్లు వుంటారు. అలాంటివారిని అనుసరించే ప్రయత్నం చేయలేక అసూయపడే వాళ్ళూ వుంటారు. సాధారణంగా విద్యాధికులు సమాజంలో అందరిచేత గౌరవించబడుతుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ... ఆ స్థాయికి చేరుకోవాలనే ఆలోచన కలుగుతూ వుంటుంది. కానీ ఏదో ఒక కారణాన్ని అడ్డుపెట్టుకుని దాని వల్లనే తాము పైచదువులు చదువుకోలేక పోతున్నామని కొందరు బాధపడుతుంటారు.

అలాగే శ్రీమంతుడి జీవన విధానాన్నిచూసిన కొందరు అలాంటి జీవితాన్ని అనుభవించలేకపోతున్నందుకు ఆవేదన చెందుతుంటారు. తమ ఆదాయం తక్కువైనందుకు అసంతృప్తికీ, ఆదాయాన్ని పెంచుకునే ఆలోచన చేయకుండా అసహనానికి లోనవుతుంటారు. ఇక ధర్మాత్ములైన వారికి కూడా సమాజంలో ప్రత్యేకమైన స్థానం లభిస్తూ వుంటుంది. ఎవరైతే ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారో, వాళ్లని భగవంతుడు కాపాడుతూ ఉంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని గురించి ఆసక్తిగా చెప్పుకుంటారుగానీ, ఆచరించాలనే విషయంపై అంతగా దృష్టిపెట్టకపోవడం జరుగుతూ వుంటుంది.

నిజానికి ఎవరు విద్యావంతులు అయినా ... శ్రీమంతులైనా దానివెనుక అహర్నిశలు వాళ్లు చేసిన కృషి దాగి వుంటుంది. అలాగే ధర్మాచరణ విషయంలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందిన వాళ్ల జీవితాలను పరిశీలిస్తే, అంతకుముందు వాళ్లు పడిన ఎన్నో కష్ట నష్టాలు కనిపిస్తాయి. వేలకిలోమీటర్ల ప్రయాణమైనా మొదటి అడుగుతో మొదలవుతుంది అన్నట్టుగా ప్రయత్నాన్ని ప్రారంభించవలసి వుంటుంది. నిరాశా నిస్పృహలు లేకుండా, అసంతృప్తి .. అసహనం లేకుండా చేసిన ప్రతి పని విజయాన్ని ఇస్తుంది.

విద్యావంతుడిగా ఎదగాలన్నా ... లక్ష్మీపుత్రుడు అనిపించుకోవలన్నా ... ధర్మమార్గాన్ని అనుసరించి దైవానుగ్రహాన్ని పొందాలన్నా అహర్నిశలు కష్టపడవలసి వుంటుంది ... అంచెలంచలుగా అభివృద్ధిని సాధించవలసి వుంటుంది. చినుకు ... చినుకు కలిసి కుండను నింపినట్టుగానే విద్య ... సంపద పెరుగుతాయనే విషయాన్ని మరిచిపోకూడదు. అలాగే ధర్మాచరణను క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. ఈ మూడింటి అవసరం జీవితంలో ప్రతి దశలోనూ వుంటుంది. వాటిలో విజయాలను అందుకోవాలంటే అందుకు నిరంతరం సాధన చేయవలసి వుంటుంది.


More Bhakti News