గ్రహదోషాలను నివారించే తీర్థం !

ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు ముందుగా అక్కడి కోనేరులో స్నానం చేసి గానీ ... ఆ నీటిని తలపై చల్లుకునిగాని దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. పుణ్య తీర్థాన్ని స్పర్శించడం వలన శరీరం ... మనసు పవిత్రమవుతాయనీ, అప్పుడు భగవంతుడి సన్నిధిలో అడుగుపెట్టడానికి తగిన అర్హతను సంపాదించుకున్నట్టు అవుతుందని భక్తులు భావిస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే కొన్ని తీర్థాలు మరింత విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. మానవ ప్రయత్నం ద్వారా కాకుండా భగవంతుడి సంకల్పం కారణంగా ఏర్పడటం కారణంగానే ఆ తీర్థాలు మరింత ప్రత్యేకతను కలిగి వుంటాయి. అలాంటి విశేషాన్ని కలిగిన పరమ పవిత్రమైన తీర్థంగా 'అష్టముఖి కోనేరు' దర్శనమిస్తుంది.

నిజామాబాద్ జిల్లా జాన్కంపేటలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ పుణ్యతీర్థం కనిపిస్తుంది. స్వామివారు స్వయంభువు మూర్తి కావడం ఒక విశేషమైతే, ఆయన సంకల్పం కారణంగా ఇక్కడి కోనేరు ఏర్పడటం మరో విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఈ కారణంగానే ఈ కోనేరు మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు.

ఇందులోని నీటిని తలపై చల్లుకుని గానీ, తీర్థంగా స్వీకరించిగాని ప్రదక్షిణలు చేస్తుంటారు. అష్టముఖి కోనేరుగా పిలవబడుతోంది కనుక, ఈ కోనేరు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయడం నియమంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విధంగా ముందుగా కోనేరుకి నమస్కరించుకుని ఆ తరువాత దైవ దర్శనం చేసుకోవడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి, మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News