కృష్ణుడి కంటే గొప్పగా ఎవరు ప్రేమించగలరు ?
బృందావనం వెళ్లిన భక్తులు తప్పనిసరిగా 'రాధాదామోదర్' ఆలయాన్ని దర్శుంచుకుంటూ వుంటారు. ఇక్కడ అడుగుపెట్టిన భక్తులకు 'రూప గోస్వామి' అనే మహానుభావుడు ... మహాభక్తుడు గురించి తెలుస్తుంది. ఆయన భక్తిశ్రద్ధలకు పరమాత్ముడే దిగివచ్చిన సంఘటనను గురించి తెలుసుకుని తన్మయులు అవుతుంటారు.
రూపగోస్వామికి కృష్ణుడి గురించిన ధ్యానం మినహా మరో ధ్యాస వుండేది కాదు. పధ్నాలుగు కిలోమీటర్ల పరిధిలో గల 'గోవర్ధనగిరి'కి ప్రతిరోజు ఆయన ప్రదక్షిణం చేస్తూ ఉండేవాడు. ఆరోగ్యపరంగా ... వాతావరణం పరంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన ప్రదక్షిణ చేయడం మాత్రం ఆపేవాడు కాదు.
వయసు పైబడిన కారణంగా ఆయన పడుతున్న అవస్థను చూసిన కృష్ణుడు. ఒకరోజున బాలకుడి రూపంలో ఆయనకి ప్రదక్షిణ మార్గంలో తారసపడతాడు. తాతా అంటూ సంభోదిస్తూ ఆయనని ఆపి, గోవర్ధన గిరికి బదులుగా ఈ రాయికి ప్రదక్షిణం చేయమని చెబుతూ ఒక రాయిని ఇవ్వబోతాడు. చిన్న పిల్లవాడి మాటలుగా భావించిన గోస్వామి, పట్టించుకోకుండా ముందుకు నడవబోతాడు.
ఆ సమయంలోనే ఆ రాయి కిందపడి పగిలిపోతుంది. ఆ రాయి లోపల కృష్ణ పాదం ... ఆవుపాదం ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆ బాలకుడు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడని గ్రహించి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ రోజు నుంచి ఆ రాయికి ప్రదక్షిణలు చేస్తూ ఆయన తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు.
తనని ఆరాధించే భక్తులను కృష్ణుడు ఎంతగా ప్రేమిస్తాడనటానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. కృష్ణుడు ... గోస్వామి పట్ల ప్రేమతో ఇచ్చిన ఆరాయి ఇప్పటికీ ఇక్కడి ఆలయంలో కనిపిస్తూ వుంటుంది. సాక్షాత్తు కృష్ణభగవానుడు ఇచ్చిన రాయి గల ఈ ఆలయానికి ప్రదక్షిణ చేయడం వలన మనోభీష్టాలు నెరవేరుతాయని చెబుతుంటారు.