అలా ఆ కష్టం నుంచి గట్టెక్కారట !
ఆధ్యాత్మిక గురువులుగా ... అవధూతలుగా అవతరించిన కొంతమంది ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు. నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ... ప్రజల మధ్య సఖ్యతను పెంపొందింపజేయడానికి తమవంతు కృషిచేశారు. ప్రజల మనసులను ప్రశాంతతకు నిలయాలుగా మార్చారు.
సిరిసంపదలలోనే సంతోషం వుందని భావించిన వారికి వాటిని ప్రసాదించారు. మోక్ష సాధన కోరుకునే వారికి దానినే అందించారు. వీళ్లంతా కూడా తాము దైవ స్వరూపాలమనిగానీ ... మహిమలెన్నో తెలుసనిగానీ ఎప్పుడూ చాటుకోలేదు. వాళ్లు ఏంచేసినా తమ చుట్టూ వున్న ప్రజలు బాగుండటం కోసమే చేశారు.తమని విశ్వసిస్తోన్న వాళ్లను ఆదుకోవడం కోసం వాళ్లు చేసిన కొన్ని పనులే మహిమలుగా భక్తుల మనసులో చెరగని ముద్రవేస్తూ వచ్చాయి.
అలా భక్తుల బాధలను తీరుస్తూ వాళ్ల ఆదరాభిమానాలను చూరగొన్న అవధూతలలో అక్కల్ కోట స్వామి ఒకరుగా మనకి కనిపిస్తాడు. తమకి ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా స్వామి వున్నాడనే ధైర్యంతో అక్కల్ కోట ప్రజలు వుండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతమంతా కూడా కరవు బారిన పడుతుంది. రోజులు గడిచిపోతున్నా ఒక్క వర్షం కూడా పలకరించకపోవడంతో వాళ్లు స్వామిని కలుసుకుని తమ పరిస్థితి పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తారు.
అప్పుడాయన ఈ శ్వరుడికి అక్కడి ప్రజల గోడును గురించి చెప్పుకున్నాడట. వర్షం కురవవలసిందేనంటూ పట్టుబట్టినట్టుగా మాట్లాడాడట. అంతే ఆ క్షణమే ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురుస్తుంది .. దాంతో గ్రామస్తుల ఆనందానికి హద్దులేకుండా పోతుంది. వాళ్లంతా కూడా ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడి నుంచి వెనుదిరుగుతారు.