సిద్ధి బుద్ధి సమేత గణపతి దర్శన ఫలితం !

లోకంలో ఏ తండ్రి అయినా తన కూతురికి వివాహం చేయాలనుకున్నప్పుడు, అబ్బాయి కుటుంబ నేపథ్యాన్ని ... అతని గుణగణాలను గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అబ్బాయి మంచివాడైతే తన కూతురికి ఎలాంటి కష్టం కలగకుండా ఉంటుందని భావిస్తాడు. అలాగే 'విశ్వరూపుడు' అనే ప్రజాపతి తన ఇద్దరి కూతుళ్ల వివాహం గురించి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.

విశ్వరూపుడికి 'సిద్ధి ... 'బుద్ధి' అనే ఇద్దరు కుమార్తెలు వుంటారు. వాళ్ల సౌందర్యం గురించి అంతా గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలోనే విశ్వరూపుడి దృష్టి వినాయకుడి వైపుకి మళ్లుతుంది. సమస్త తీర్థాలను చుట్టిరమ్మంటూ శివపార్వతులు పెట్టిన ఒక పరీక్షలో నెగ్గడం కోసం వినాయకుడు వాళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు.

తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయడం వలన సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని అంటాడు. తల్లిదండ్రుల ఆశీస్సులకు మించిన వరాలు లేవని లోకానికి చాటిచెబుతాడు. తల్లిదండ్రులను ప్రేమించే వాళ్లు భార్య మనసుకి కష్టం కలగకుండా చూసుకుంటారని లోకంలో చెప్పుకుంటూ వుండటాన్ని విశ్వరూపుడు గుర్తుచేసుకుంటాడు.

సాక్షాత్తు ఆదిదంపతులుగా పూజలందుకుంటోన్న శివపార్వతులతో వియ్యమందుకోవడానికి ఎంతో పుణ్యం చేసుకుని వుండాలని అనుకుంటాడు. తన కూతుళ్లకు వినాయకుడు భర్త అయితే అంతకిమించిన అదృష్టం మరొకటి లేదని భావించి, శివపార్వతులను కలుసుకుని తన మనసులోని మాటను చెబుతాడు. అందరూ అంగీకరించడంతో 'సిద్ధి' ... 'బుద్ధి'లతో వినాయకుడి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

అలా సిద్ధి ... బుద్ధి సమేతంగా వినాయకుడు ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాయి. సిద్ధి ... బుద్ధి సమేతంగా కొలువుదీరిన వినాయకుడిని దర్శించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు పరిపూర్ణంగా లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News