పితృదేవతలకి ఇష్టమైన కాలం ఇదే !
భాద్రపద మాసంలో 'పౌర్ణమి' నుంచి 'అమావాస్య' వరకు గల కాలాన్ని మహాలయ పక్షంగా చెప్పడం జరుగుతోంది. మహాలయ పక్షాన్నే బహుళ పక్షమనీ ... పితృపక్షమని అంటారు. ఈ పదిహేను రోజులు పితృదేవతలకి ఇష్టమైన కాలంగా చెప్పబడుతోంది. అందువలన వాళ్లను పూజించడానికి ఇది ఎంతో ముఖ్యమైన కాలం.
మరణించినవారికి పిండప్రదానాలు నిర్వహించడం వలన వారికి సద్గతులు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. అందువలన పితృ దేవతలకి పుణ్యలోకాలను కలిగించే ఈ విధిని తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేస్తోంది. అందువలన ఈ రోజుల్లో వాళ్లకి శ్రాద్ధ విధులను నిర్వహించడం ... పిండ ప్రదానాలు చేయడం ... తర్పణాలు వదలడం వంటివి ఆచరిస్తూ వుంటారు. మరణించినవారికి ఆ తిథిని బట్టి ఆబ్దికాలు నిర్వహిండమనేది ఆయా కుటుంబాలకి సంబంధించినదిగా కనిపిస్తుంది.
ఇక చనిపోయినవారి తిథి జ్ఞాపకం లేనివారంతా పితృకార్యాలను జరపడానికి ఈ మహాలయ పక్ష కాలాన్ని ఉపయోగించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సామూహికంగా పితృదేవతలను పూజించేదిగా మహాలయ పక్షం కనిపిస్తూ వుంటుంది. ఈ విధంగా ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను ఆరాధించడం వలన వారి ఆశీస్సులు లభిస్తాయనీ, ఫలితంగా దుఃఖాలకు దూరంగా జీవితం కొనసాగుతుందని చెప్పబడుతోంది.