రకరకాల ధ్వనులు పలికే రాయి

కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి రాళ్లు వివిధ రకాల ఆకారాలను సంతరించుకుని కనిపిస్తూ ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. మరికొన్ని రాళ్లు గుడిలో 'గంట' శబ్దాన్ని తలపించేలా మోగుతూ విస్మయులను చేస్తుంటాయి. అలా 'రాయి' దైవత్వాన్ని సంతరించుకుని కనిపించే క్షేత్రాల్లో 'రంగుండ్ల' ఒకటిగా దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా అనుముల మండలంలో ఈ క్షేత్రం నెలకొని వుంది.

రాళ్లను 'గుండ్లు' అని కూడా పిలుస్తుంటారు ... ఈ రాయి ప్రత్యేకత కారణంగానే ఈ గ్రామానికి 'రంగుండ్ల' అనే పేరు వచ్చింది. ఇక్కడి గుట్టపై 'బుడియా బాపు' అనే యోగి పురుషుడి జీవసమాధి కనిపిస్తుంది. చాలాకాలం క్రితం ఆయన తన మహిమలతో ఈ ప్రాంతవాసుల మనసుదోచుకున్నట్టు చెబుతారు.

అనేక ప్రాంతాలను దర్శిస్తూ ... తాను ఎక్కడ స్థిరంగా ఉండాలో తెలుపవలసినదిగా ఆయన వేంకటేశ్వరస్వామిని కోరాడట. ప్రత్యేకమైన ఆకృతిని సంతరించుకున్న ఒక రాయి ... పన్నెండు రకాల శబ్దాలను చేస్తుందనీ, ఆ రాయి గల గుట్టను అన్వేషించి అక్కడ ఉండమని ఆ స్వామి సెలవిచ్చాడట. అలా అన్వేషణను ఆరంభించిన ఆయన ఈ ప్రదేశానికి చేరుకొని, ఇక్కడి రాయికి ఆ లక్షణం వుండటం గమనించి ఇక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అంటారు.

అలా కొట్టగానే పన్నెండు రకాల ధ్వనులు చేసే రాయిని ఇప్పటికీ ఇక్కడ చూడొచ్చు. ఇంతటి విశిష్టతను కలిగిన గుట్టపై సజీవ సమాధి చెందిన 'బుడియా బాపు' భక్తులను వెన్నంటి కాపాడుతూనే ఉంటాడని అంతా విశ్వసిస్తూ వుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఈ మహిమ గల క్షేత్రాన్ని దర్శించుకుని ఆయన ఆశీస్సులు అందుకుంటూ వుంటారు.


More Bhakti News