మహాదేవుడు కొలువైన ప్రాచీన క్షేత్రం
కాకతీయుల పరిపాలనా కాలంలో శైవ దేవాలయాల నిర్మాణం విస్తారంగా జరిగింది. తమకి పూర్వం నిర్మించబడిన ఆలయాలను అభివృద్ధి చేయడంలోను, కొత్తగా శివాలయాలను నిర్మించడంలోను కాకతీయులు చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆ ఆలయాల నిర్మాణాన్ని పరిశీలిస్తే, శివుడిపట్ల వారికి గల భక్తిశ్రద్ధలు ఎంతటివో అర్థమవుతూ వుంటాయి.
అలా కాకతీయుల పరిపాలనా కాలంలో నిర్మించబడిన శివాలయం మనకి 'రుద్రవరం'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఈ క్షేత్రం అలలరారుతోంది. రుద్రమదేవి తన పరిపాలనాకాలంలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఓ కోటను నిర్మించాలని నిర్ణయించుకుందట. అలా అప్పట్లో చాలావరకూ పూర్తయిన కోట ఇప్పుడు ఇక్కడ శిధిలావస్థలో కనిపిస్తూ వుంటుంది.
అదే సమయంలో ఇక్కడ దర్శించుకోవడానికిగాను ఆమె ఒక శివాలయాన్ని కూడా నిర్మింపజేసిందట. ఆ స్వామి నిత్యపూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. రుద్రుడు కొలువైన కారణంగా ... రుద్రమదేవి ప్రతిష్ఠించిన కారణంగా ఈ గ్రామానికి 'రుద్రవరం' అనే పేరు వచ్చినట్టు చెబుతారు. వాడుకలో ఈ గ్రామాన్ని 'రుద్రారం'గా పిలుచుకుంటూ వుంటారు.
ఇక్కడ లభిస్తోన్న శాసన ఆధారాలు మనల్ని రుద్రమదేవి కాలానికి తీసుకువెళతాయి. ఇక విచారించదగిన విషయం ఏమిటంటే ఈ ఆలయం కూడా గుప్తనిధుల పేరుతో తవ్వకాలకు గురికావడం. ఈ కారణంగా ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నా గత చరిత్రకు ... ఘనచరిత్రకు ఇది నిదర్శనమై నిలుస్తోంది. ఇక్కడి స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు ... ఆయన అనుగ్రహాన్ని అందుకుంటూ తరిస్తుంటారు.