కష్టాలను తరిమివేసే కృష్ణ దర్శనం
బాధల్లో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తుకువస్తాడు. అ బాధలు తీరిపోయిన తరువాత కూడా తనని ఆరాధించేవాళ్లనే భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు. ఇకపై వాళ్లకి ఎలాంటి కష్టం రాకుండా చూస్తుంటాడు. అందుకే ఎల్లవేళలా భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ... ఆయన ఆలయాలను దర్శిస్తూ వుండాలని పెద్దలు చెబుతుంటారు.
అందువల్లనే ఆయా ప్రాంతాలలో గల ఆలయాలు ఎప్పుడు చూసినా భక్త జన సందోహంతో కనిపిస్తూ వుంటాయి. అలాంటి ఆలయాల జాబితాలో 'ఖమ్మం'లో గల 'కృష్ణ మందిరం దర్శనమిస్తూ వుంటుంది. వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధిచెందిన కృష్ణ మందిరాలలో ఈ ఆలయం ముందువరుసలో కనిపిస్తుంది.
సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో వేణువు వాయిస్తున్నట్టుగా కృష్ణుడు దర్శనమిస్తూ వుంటాడు. పాలరాతిలో మలచబడిన ఈ ప్రతిమ కళ్లను కట్టిపడేస్తుంది. సమ్మోహితులను చేసే ఆ ప్రతిమను చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులు స్వామివారి మూలమూర్తిని చూస్తూనే తమ కష్టాలను మరిచిపోతుంటారు.
అసలు ఆయనని దర్శించినంత మాత్రాన్నే దారిద్ర్యం ... దుఃఖం దూరమైపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఈ ఆలయంలో ఉన్నంతసేపు మనసు మందిరంలో కృష్ణ నామస్మరణే మోగుతుంటుంది. ఇక్కడి కృష్ణుడి లీలావిశేషాలు భక్తుల అనుభవాలుగా వినిపిస్తుంటాయి ... అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంటాయి.