ఈ రోజున ఉమామహేశ్వరులను పూజించాలి

సాధారణంగా స్త్రీలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే నోములు ... వ్రతాల విషయానికి వస్తే, అవన్నీ కూడా పార్వతీదేవికి పరమశివుడు చెప్పినట్టుగా పేర్కొనడం జరుగుతూ వుంటుంది. అలాంటి శివపార్వతులే పూజలు అందుకునే వ్రతాలలో కొన్ని ప్రధానమైనవిగా కనిపిస్తుంటాయి. అలాంటివాటిలో 'ఉమామహేశ్వర వ్రతం' ముందువరుసలో కనిపిస్తుంది. 'భాద్రపద పౌర్ణమి' రోజున ఈ వ్రతాన్ని జరుపుతుంటారు.

తనని నమ్మిన భక్తులు అవసరాల్లో వున్నా ... ఆపదల్లో చిక్కుకున్నా సదాశివుడు క్షణకాలమైనా ఆలస్యం చేయకుండగా అక్కడికి చేరుకుంటాడు ... తన భక్తులను రక్షించుకుంటాడు. ఇక జగాలనేలే తల్లిగా పార్వతీదేవి తన బిడ్డల క్షేమాన్ని కనిపెట్టుకునే వుంటుంది. ప్రశాంతమైన వారి జీవితానికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా ఏదో ఒక రూపాన్ని ధరించి దుష్టులను అణచివేస్తూనే వుంటుంది.

అలాంటి శివపార్వతులు ... ఆదిదంపతులుగా సమస్త సంతోషాలను ప్రసాదిస్తుంటారు. వాళ్ల అనుగ్రహాన్ని అందించే విశిష్టమైన వ్రతంగా 'ఉమామహేశ్వర వ్రతం' కనిపిస్తుంది. ఈ రోజున ఉదయాన్నే స్నానంచేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరంలో శివకుటుంబం కలిగిన చిత్రపటాన్ని ఏర్పాటుచేసుకుని, దానిని పూలమాలికలతో అలంకరించుకోవలసి వుంటుంది.

ఉపవాస దీక్షను చేపట్టి ఆదిదంపతులను అంకిత భావంతో ఆరాధిస్తూ ... ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది. భక్తి శ్రద్ధల లోపం లేకుండా ... నియమనిష్టలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి వుంటుంది. ఈ వ్రత ఫలితంగా సమస్త సంపదలు కలుగుతాయనీ ... సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News