కష్టాలను కరిగించేది ఈశ్వరుడే !
కర్కోటకుడి కారణంగా తన రూపం మారిపోవడంతో ... తన పేరును కూడా నలుడు మార్చుకుంటాడు. బాహుకుడు అనే పేరుతో రుతుపర్ణుడు అనే రాజు దగ్గర వంటవాడిగాను ... రథం నడిపే వ్యక్తిగాను పనిచేస్తుంటాడు. ఆయనే తన భర్త అనే సందేహం కలగడంతో, ఆయనని తన దగ్గరికి రప్పించడానికి దమయంతి ఒక నాటకమాడుతుంది.
ఆ నాటకంలో భాగంగా తన ద్వితీయ స్వయంవరానికి సంబంధించిన వర్తమానాన్ని రుతుపర్ణుడికి పంపుతుంది. రథసారధిగా ఆయన బాహుకుడిని బయలుదేరదీస్తాడు. దమయంతి స్వయంవరం గురించి ఆయన ద్వారా తెలుసుకున్న బాహుకుడు నివ్వెరపోతాడు. మహా పతివ్రత అయిన తన భార్య అలాంటి నిర్ణయం ఎప్పటికీ తీసుకోదని అనుకుంటాడు. రాజుగారి మాటను కాదనలేక ఆయనతో కలిసి దమయంతి అంతఃపురానికి చేరుకుంటాడు.
దమయంతి చాటుగా ఉండి తన ఇద్దరి పిల్లలను బాహుకుడికి కనిపించేలా పంపిస్తుంది. పిల్లలను చూడగానే బాహుకుడిగావున్న నలుడు తనని తాను నియంత్రించుకోలేకపోతాడు. తనని ఎవరైనా గమనిస్తున్నారేమోననే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రేమతో వాళ్లను దగ్గరికి తీసుకుని ముద్దుచేస్తుంటాడు.
చాలాకాలం తరువాత తిరిగొచ్చిన తండ్రి తన బిడ్డలను ఎంత ఆత్రుతగా అక్కున చేర్చుకుంటాడో, బాహుకుడు కూడా అచ్చు అలాగే ప్రవర్తిస్తూ వుంటాడు. అది గమనించిన దమయంతి ... ఆయనే నలమహారాజు అని నిర్ధారణ చేసుకుని అక్కడికి వస్తుంది. తనని రప్పించడం కోసమే ఆమె అలా చేసిందని తెలుసుకున్న నలుడు తన పూర్వరూపాన్ని పొందుతాడు. తిరిగి తామంతా కలుసుకోవడానికి ఈశ్వరుడే కారకుడంటూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.