ఆశ్చర్య చకితులను చేసే ఆచారం !
సాధారణంగా సిద్ధులు ... యోగుల వంటి వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకుని అక్కడ ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతుంటారు. అక్కడి ప్రజలకి వాళ్లపట్ల అపారమైన విశ్వాసం కలుగుతుంది. దాంతో వాళ్లని దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తూ వుంటారు. ఆ యోగులు సజీవసమాధి చెందిన తరువాత ఆ ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతుంటాయి.
ఆ పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మనసులోని కోరికలు చెప్పుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో మొక్కులకు సంబంధించి ఒక్కోచోట ఒక్కో ఆచారం కనిపిస్తూ వుంటుంది. సాధారణంగా దైవ క్షేత్రాల్లో తమ మొక్కు చెల్లించమంటూ కొబ్బరికాయలు కట్టడం ... గంటలు కట్టడం వంటివి చేస్తుంటారు. ఇక ఈ తరహా క్షేత్రాల విషయానికి వచ్చే సరికి, మొక్కుకునేవారు ఆచరించే పద్ధతి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది.
అలా ఆశ్చర్యానికి గురిచేసే క్షేత్రం మనకి 'రంగుండ్ల'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా అనుముల మండలం పరిధిలో ఈ గ్రామం కనిపిస్తుంది. చాలాకాలం క్రిందట ఇక్కడి గుట్టపై నివసించిన 'బుడియా బాపు' అనే అసాధారణ వ్యక్తి జీవసమాధి ఇక్కడ కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల వారంతా ఆయనని దైవస్వరూపంగా భావించి పూజిస్తూ వుంటారు. ఆయనకి నమస్కరించుకుని తమ మనసులోని కోరికలు చెప్పుకుంటారు.
తమ కోరికను చెప్పుకుని ఈ ప్రదేశంలో ఒక రంగుజెండా కర్రను పాతడం ఆచారంగా వస్తోంది. ఈ జెండా స్వామికి తమ కోరికను గుర్తుచేస్తూ ఉంటుందనీ, దాంతో ఆయన తప్పక తమ కోరికను నెరవేరుస్తాడని విశ్వసిస్తుంటారు. ఇక్కడి వచ్చే భక్తుల సంఖ్యకు ... వారిలో గల బలమైన విశ్వాసానికి వేలాదిగా కనిపించే ఈ జెండాలు అద్దంపడుతూ వుంటాయి.