ఆలుమగలను అనుగ్రహించే గణపతి
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వినాయకుడి క్షేత్రాలు కనిపిస్తూ వుంటాయి. దేవతలు ... మహర్షులు ... మహారాజులు ... మహాభక్తులు ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతోన్న వివిధ వినాయక మూర్తులు ఎంతో విశిష్టతను సంతరించుకుని దర్శనమిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కో వినాయక క్షేత్రం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. అలాంటి క్షేత్రాలలో 'టిట్వాలా' ఒకటిగా కనిపిస్తుంది.
మహారాష్ట్ర - కల్యాణ్ సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. 'కణ్వ మహర్షి'చే ప్రతిష్ఠించబడిన వినాయకుడికి ఒక ప్రత్యేకత వుంది. అదే ... విడిపోయిన భార్యాభర్తలను కలపడం. సాధారణంగా వినాయకుడిని దర్శించడం వలన తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాగిపోతుంటాయి. ఆశించిన రంగంలో విజయాలు లభిస్తుంటాయి. అయితే ఇక్కడి వినాయకుడిని దర్శించి ప్రార్ధించడం వలన భార్యాభర్తల బంధం మరింత బలపడుతుందని స్థలపురాణం చెబుతోంది.
ఇక్కడి వినాయకుడిని పూజించడం వల్లనే శకుంతల - దుష్యంతుడు ఒకటయ్యారట. ఈ కారణంగానే వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కుంటోన్న స్త్రీలు - పురుషులు ఇక్కడి స్వామిని దర్శించుకుంటూ వుంటారు. ఈ స్వామి అనుగ్రహంతో ఒకటైన దంపతులు మొక్కులు చెల్లించుకుంటూ ఇక్కడ కనిపించడం స్వామి మహిమను స్పష్టంచేస్తూ వుంటుంది.