కోరిన వరాలనిచ్చే సిందూర గణపతి
సాధారణంగా పూజలో పూలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటాయి. కానీ వినాయక చవితి పర్వదినం రోజున పూజలో 'గరిక' ప్రధాన పాత్రను పోషిస్తూ వుంటుంది. అసలు గణపతి పూజలో 'గరిక' ఎందుకు సమర్పిస్తారోననే సందేహం కొంతమంది భక్తులకు కలుగుతూ వుంటుంది. 'అనలాసురుడు' అనే రాక్షసుడు తన సహజ సిద్ధమైన అగ్ని జ్వాలలతో లోకాలను దహించడానికి ప్రయత్నించినప్పుడు, వినాయకుడు ఆ రాక్షసుడిని మింగివేస్తాడు.
మహర్షులు సమర్పించిన గరిక వలన ఆయన ఉదరంలోని తాపం తగ్గిందట. అందుకే తనని గరికతో పూజించిన వారిని తప్పక అనుగ్రహిస్తానని ఆయనే చెప్పాడు. ఇక గరిక సమర్పించడం వలన ఆయన ఎంతగా సంతోషపడిపోతాడో ... సిందూరంతో పూజించినా అదే విధంగా మురిసిపోతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
హనుమంతుడికే కాదు ... వినాయకుడికి కూడా సిందూరమంటే మహా ఇష్టమట. అందువలన గణపతిని సిందూరంతో అలంకరించినా ... పూజించినా ఆయన వెంటనే ప్రసన్నుడవుతాడని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగానే సిందూర వర్ణంలో వినాయక మూలమూర్తులు దర్శనమిచ్చే క్షేత్రాలు మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అడిగిన వరాలను అందించే అక్షయ పాత్రలా అనిపిస్తూ వుంటాయి.