ఐశ్వర్యాన్ని కలిగించే అనంత వ్రతం !
ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం ఆనందంగా సాగిపోవాలనే అంతా ఆ భగవంతుడిని కోరుకుంటూ వుంటారు. ఎందుకంటే శక్తికి మించిన కష్టాలను ... గట్టెక్కలేని ఆపదలను ఎవరూ కూడా ఎదుర్కోలేరు. ఆ సమయంలో భగవంతుడే సాయపడాలి ... లేదంటే ఆ సమస్యను ఎదుర్కునే శక్తిని ఆయనే ప్రసాదించాలి.
ఎక్కువమంది అనుభవించే కష్టాలు ఆర్ధికపరమైనవిగా ... అనారోగ్యపరమైనవిగా కనిపిస్తూ వుంటాయి. ఆర్ధిక పరిస్థితి బాగోలేనప్పుడు ఎంతటివారైనా మానసికంగా కుంగిపోతుంటారు. ఇక ఎంత సంపద వున్నా దానిని అనుభవించే ఆరోగ్యం లేనప్పుడు కూడా మానసికంగా కుంగిపోవడం జరుగుతూ వుంటుంది.
అందుకే జీవితంలో ఆనందానికి ఆధారాలుగా చెప్పబడుతోన్న ఆర్ధిక స్థితి ... ఆరోగ్య పరిస్థితి బాగుండాలని అంతా ఆశిస్తూ వుంటారు. దారిద్ర్యం వలన కలిగే దుఃఖం ... ఆవేదనను కలిగించే అనారోగ్యం తొలగిపోవడానికి ఏంచేస్తే బాగుంటుందనే చాలామంది ఆలోచిస్తూ వుంటారు. అలాంటి బాధల నుంచి బయటపడటానికి మార్గంగా 'అనంతపద్మనాభ వ్రతం' చెప్పబడుతోంది.
తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆనవాయతీగా ఈ వ్రతాన్ని ఆచరించేవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువే 'అనంతుడు' (ఆదిశేషుడు)గా చెప్పబడుతున్నాడు కనుక, ఈ రోజున ఆయనని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి వుంటుంది.
ముందుగా వినాయకుడినీ ... ఆ తరువాత యమునా నది నీటిగా భావన చేసిన నీటిని పూజించి అనంతుడిని అరాధించవలసి వుంటుంది. పధ్నాలుగు లోకాలను ఏలే స్వామి కనుక పధ్నాలుగు ముడులు కలిగిన తోరమును ధరించాలనే నియమం కనిపిస్తుంది. ఈ తోరమును భర్త కుడిచేతికి భార్య ... ఆమె ఎడమచేతికి భర్త కట్టవలసి వుంటుంది.
ఈ వ్రతంలో నైవేద్యాలు కూడా పద్నాలుగు రకాలుగా ఉండాలనీ ... ఉద్యాపన కూడా పద్నాలుగు సంవత్సరాల తరువాత చెప్పుకోవాలని స్పష్టం చేయబడుతోంది. నియమనిష్టలను ఆచరిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సంపదలు ... సంతోషాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.