ఎవరి భక్తి వారిని కాపాడుతూ వుంటుంది !
భక్తికి మించిన ఆశ్రమం లేదు ... భక్తికి మించిన ఆయుధం లేదు. భక్తి ఎలాంటి ఆపద నుంచైనా గట్టెక్కిస్తుంది ... ఎంతటి కష్టనష్టాలనుంచైనా బయటపడేస్తుంది. అలాంటి భక్తిని కలిగివున్నవారి జీవితంలోని కొన్ని సంఘటనలు ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి సంఘటన ఒకటి 'సరస్వతీ బాయి' జీవితంలోను జరుగుతుంది. సరస్వతీబాయి ఎవరో కాదు ... సాక్షాత్తు పురందరదాసు భార్య.
పురందరదాసు పాండురంగడి భక్తుడిగా మారడానికి ముందు, అంటే ఆయన శ్రీనివాసుడు అనే పేరుతో పిలవబడుతున్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. వ్యాపార లావాదేవీలు నిర్వహించే శ్రీనివాసుడు, మహా పిసినారిగా ఉండేవాడు. దైవభక్తికీ ... దానధర్మాలకి కూడా దూరంగా ఉండేవాడు. భర్త ధోరణికి బాధపడుతూనే సరస్వతీదేవి ఆ దేవదేవుడిని అనునిత్యం ఆరాధించేది. అయితే భర్తకి తెలియకుండా దానాలు చేయడానికి మాత్రం ఆమె భయపడుతూ వుండేది.
అలాంటి పరిస్థితుల్లో ఆ స్వామి మారువేషంలో వచ్చి దానం అడిగితే ... ఖరీదైన తన 'ముక్కుపుల్ల'ను దానంగా ఇస్తుంది. ఈ విషయం భర్తకి తెలిస్తే సహించడనే భయంతో గన్నేరు పప్పు కొట్టుకుని తినబోతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ పుక్కుపుల్ల వచ్చి ఆ పాత్రలో పడుతుంది. భగవంతుడు అనుగ్రహించినందుకు సంతోషంతో పొంగిపోతూ ఆమె ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.