స్వాములను ఇవి పూజిస్తూ ఉండేవట !
కొన్ని క్షేత్రాల పేర్లు వినడానికి ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటాయి. అలాంటి క్షేత్రాలను దర్శించినప్పుడు అవి మహిమాన్వితమైనవిగానే కనిపిస్తుంటాయి. ఆ క్షేత్రంలో జరిగే కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూస్తే బాగుండునని అనిపిస్తుంది. అలాంటి అనుభూతిని కలిగేంచే క్షేత్రంగా 'సిద్ధులకొండ' కనిపిస్తూ వుంటుంది.
నెల్లూరు - సైదాపురం సమీపంలో గల ఈ గుట్టపై సిద్ధేశ్వరస్వామి దర్శనమిస్తూ వుంటాడు. ఒకప్పుడు ఈ కొండపై సిద్ధులు తపస్సు చేసుకునేవారట. ఒక రాత్రివేళ రహస్యంగా ఈ విషయాన్ని గమనించిన ఒకవ్యక్తి, వాళ్ల హెచ్చరికను పట్టించుకోకుండా గ్రామస్తులకు చెప్పడం వలన ప్రాణాలు కోల్పోతాడు.
ఊళ్లో జనం ఈ కొండపైకి చేరుకునేసరికి ఆ సిద్ధులు శిలలుగా మారిపోతారు. అప్పటి నుంచి ఇక్కడి వాళ్లు ఈ సిద్ధులను పూజిస్తూ వస్తున్నారు. అయితే అప్పట్లో ప్రతినిత్యం ఇక్కడి స్వాములను పెద్దపులి ... నాగుపాము ... ఉడుము పూజిస్తూ భక్తులకు కనిపించేవట. ఇవి ఎక్కడి నుంచి వచ్చేవో ... తిరిగి ఎక్కడికి వెళ్లేవో ఎవరికీ తెలియదు.
తాము వచ్చేసరికి అవి అక్కడి నుంచి వెళ్లిపోవడం కోసం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ భక్తులు కొండను ఎక్కేవారట. ఇక్కడి ఆలయానికి స్థానికులు ఎన్నిసార్లు తలుపులు ఏర్పాటు చేసినా అవి ఉండకపోవడం కూడా ఓ మహిమగానే చెప్పుకుంటూ వుంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.