శివుడిచే పూజలందుకున్న వినాయకుడు

వినాయకుడి నుంచి మూడు దివ్యపురములను వరంగా పొందిన అసురుడు 'త్రిపురాసురుడు' గా పిలవబడుతూ వుంటాడు. భగవంతుడి వరప్రసాదంగా తనకి లభించిన శక్తులు ఆయన గర్వానికి కారణమవుతాయి. దాంతో ఆయన అటు దేవతలను ... ఇటు సాధు సత్పురుషులను నానావిధాలుగా హింసిస్తూ వుంటాడు.

ఆయన ఆగడాలను భరించలేని దేవతలు ... మహర్షులు తమ ఆవేదనని పరమశివుడితో చెప్పుకుంటారు. లోక కల్యాణం కోసం త్రిపురాసురుడిని అంతంచేయక తప్పదని శివుడు భావిస్తాడు. త్రిపురాసురుడు పొందిన వరాన్ని గురించి తెలుసుకున్న శివుడు ... వినాయకుడిని ప్రార్ధించి యుద్ధానికి బయలుదేరుతాడు.

గణపతి ప్రసాదించిన శక్తిమంతమైన అస్త్రంతో త్రిపురాలను ఒక్క వేటుతో ధ్వంసం చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. తన విజయానికి కారకుడైన వినాయకుడికి ఒక ఆలయాన్ని నిర్మించి అందులో ఆయన మూర్తిని ప్రతిష్ఠిస్తాడు. అదే 'రంజన్ గావ్' క్షేత్రంగా అలరారుతోంది. పూణేకి సమీపంలో గల ఈ క్షేత్రం 'మహాగణపతి' క్షేత్రంగా భక్తులతో పూజలు అందుకుంటూ వుంటుంది.

సాక్షాత్తు సదాశివుడు ప్రతిష్ఠించినదిగా చెప్పబడుతోన్న ఇక్కడి వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. పరమశివుడి చేతనే పూజలు అందుకున్న మహాగణపతిని కనులారా దర్శించుకుని పరవశించి పోతుంటారు. ఈ స్వామి అనుగ్రహం కారణంగా విఘ్నాలు తొలగిపోయి విజయాలు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News