దోషాలను నివారించే దివ్యక్షేత్రం
ఆధ్యాత్మిక గ్రంధాలను పరిశీలిస్తే శ్రీమహావిష్ణువును శివుడు ఆరాధించడం ... ఆదిదేవుడిని గురించి శ్రీమహావిష్ణువు ధ్యానం చేయడం వంటి సందర్భాలు కనిపిస్తూ వుంటాయి. అలాగే శైవ క్షేత్రాలకు కేశవుడు ... కేశవుడి క్షేత్రాలకు శివుడు క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తూ వుండటం మనకి కనిపిస్తూ వుంటుంది. ఇక శివకేశవులు ఒకే గర్భాలయంలో కొలువైన క్షేత్రాలు కూడా లేకపోలేదు.
ఈ నేపథ్యంలో విష్ణుమూర్తి ... విశ్వనాథుడు ఒకేచోట కొలువుదీరిన క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. సమస్త లోకాలను నడిపించే శివకేశవులను ఒకేచోట దర్శించినప్పుడు భక్తులు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. సాధారణంగా శివకేశవులు కొలువుదీరిన క్షేత్రాల్లో శివలింగంతో పాటుగా రాముడు .. కృష్ణుడు .. విష్ణుమూర్తి .. వేంకటేశ్వరస్వామివారి మూర్తులు అదే ప్రాంగణంలో దర్శనమిస్తూ వుంటాయి.
అందుకు పూర్తి భిన్నమైన ఆలయం మనకి నల్గొండ జిల్లా 'బెజ్జికల్' లో కనిపిస్తుంది. ఇది 'యోగానంద లక్ష్మీనరసింహస్వామి' క్షేత్రం. ఇక్కడి నరసింహస్వామి మూలమూర్తి చేతిలో 'శివలింగం' కనిపిస్తూ వుండటం విశేషం. ఇలాంటి మూర్తి కనిపించడం చాలా అరుదనీ, అదే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత అని చెబుతుంటారు. ఇక్కడికి సమీపంలోనే ప్రాచీనకాలంనాటి శివాలయం ఉందనీ, ఆ రకంగా కూడా ఈ ప్రదేశం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని స్థానికులు చెబుతుంటారు.
ప్రాచీనకాలం నాటి నుంచి తన విశిష్టతను చాటుకుంటోన్న ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని అంటారు. వైశాఖ మాసంలో జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవం చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ స్వామిని దర్శిస్తూ .. సేవిస్తూ ... తరిస్తుంటారు.