కాలం ఇలా అనుకూలిస్తుంది !
భగవంతుడి అనుగ్రహం లేకుండా ... ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించకుండా ఎవరూ ఏదీ సాధించలేరు. ఈ విషయాన్ని గ్రహించలేని కొంతమంది ముందుగా తమ పనులు చూసుకుని ఆ తరువాత కుదిరితే దేవాలయానికి వెళుతుంటారు ... లేదంటే లేదు. పర్వదినాల్లోను ఆలయానికి రాకుండా ... తమకి అంత తీరికలేదని చెబుతూ వుండేవాళ్లు కనిపిస్తూనే వుంటారు.
భగవంతుడు ఇచ్చిన సమయంలో ఆయనని స్మరిచుకోవడానికీ ... కృతజ్ఞతలు తెలుపుకోవడానికి రోజు మొత్తంలో కొన్ని నిమిషాలు కూడా కేటాయించలేకపోవడం నిజంగా విచారించదగిన విషయం. ఇక మరికొంత మంది భగవంతుడి వైపు మనసు మళ్లించడానికి చాలాసమయం వుందని చెబుతుంటారు. తమకి కొన్ని బరువులు ... బాధ్యతలు ఉన్నాయనీ, అవి తీరిన తరువాత కృష్ణా .. రామ అనుకుంటూ ఉంటామని అంటూవుంటారు.
ఇది ఎలాంటిదంటే ... కెరటాలు తగ్గిన తరువాత సముద్రంలో స్నానం చేద్దామని అనుకోవడంలాంటిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. జీవితమన్నాక వృత్తిపరమైన పనుల వత్తిడి ఉంటూనే వుంటుంది. అలాగే బరువు బాధ్యతలు కూడా పెరుగుతూపోతూనే వుంటాయి. అన్నింటి నుంచి విముక్తి లభించడం అరుదైన విషయం ... ఒకవేళ అది జరిగినా అప్పుడు ఆరోగ్యం సహకరించకపోవచ్చు.
కాలం ఎంత ప్రతికూలంగా నడుస్తున్నప్పటికీ, భగవంతుడి వైపు అడుగుపడితే చాలు ... అదే కాలం అనుకూలంగా మారిపోతుంది. అందుకే ఎన్నిపనులు వున్నా .... బరువు బాధ్యతలు వున్నా భగవంతుడిని దర్శించడనికీ ... ధ్యానించడానికి సమయాన్ని కేటాయించడం అన్ని విధాలా మంచిది. భగవంతుడిని దర్శించడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ప్రశాంతత సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. దైనందిన వ్యవహారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేస్తుంది.
భగవంతుడిని దర్శించుకోవడం వలన ఆయన పట్ల విశ్వాసం మరింత పెరుగుతుంది. ఫలితంగా పనులు త్వరగా పూర్తవుతాయి. బరువు బాధ్యతలను తేలికగా నిర్వహించే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. అందుకే వీలైనంత వరకూ భగవంతుడికి సమీపంగా వుండాలి ... ఆయన నామాన్ని స్మరిస్తూ ... రూపాన్ని దర్శిస్తూ వుండాలి.