భగవంతుడు ఏర్పరిచిన బంధం !
గురువు అనుగ్రహం కారణంగా జయదేవుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ వుంటాడు. కుటుంబపరమైన సమస్యల కారణంగా పద్మావతి కూడా ఆ ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడే జయదేవుడికీ ... పద్మావతికి పరిచయం కలుగుతుంది. రాధాకృష్ణుల ప్రేమతత్త్వాన్ని జయదేవుడు తన రచనలతో అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుండటం పద్మావతిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
జయదేవుడి కావ్య రచనకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడంలో ఆమె ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. పవిత్రతకు ప్రతీకగా కనిపించే వారి మనసులను ఆశ్రమంలోని కొందరు అపార్థం చేసుకుంటారు. గురువుగారి మనసు దోచుకున్న జయదేవుడిని బయటికి పంపించడానికి ఇదే మంచి అవకాశంగా భావిస్తారు. జయదేవుడు .. పద్మావతి కలిసి ఆశ్రమానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని లేనిపోనివి కల్పించి చెబుతారు.
వాళ్లిద్దరినీ పిలిపించి ... తన దృష్టికి వచ్చిన ఫిర్యాదును గురించి గురువుగారు ప్రస్తావిస్తాడు. రాధాకృష్ణుల ప్రేమతత్త్వాన్ని గురించి ఆలోచిస్తూ తమని తాము మరచిపోయామే గాని తమ మధ్య ఎలాంటి భావన లేదని వాళ్లు సమాధానమిస్తారు. తమపై అందిన ఫిర్యాదు నిజమని భావిస్తే తనని బయటికి పంపించమనీ, అమాయకురాలైన పద్మావతిని ఆశ్రమవాసానికి దూరం చేయవద్దని కోరతాడు జయదేవుడు.
ఆయనని గురించి పద్మావతి కూడా అదే విషయాన్ని గురువుతో చెబుతుంది. వాళ్ల పవిత్ర హృదయాలు ... ఆ కృష్ణ భగవానుడిపట్ల వాళ్లకి గల భక్తిశ్రద్ధలను గురువు అర్థం చేసుకుంటాడు. ఆ కృష్ణ భగవానుడు తన సేవ కోసమే వాళ్లు ఒకరికొకరు తారసపడేలా చేశాడనే విషయం ఆయన గ్రహిస్తాడు. వివాహబంధంతో వాళ్లిద్దరినీ ఒకటిగా చేసే ఉపకరణగా ఆ భగవంతుడు తనని ఉపయోగిస్తున్నట్టుగా భావిస్తాడు.
తన ఉద్దేశాన్ని అందరి సమక్షంలో వ్యక్తం చేసి, వాళ్లిద్దరికీ వివాహాన్ని జరిపిస్తాడు. అలా కొంతమంది జయదేవుడికి చెడు చేయాలని అనుకుంటే అది ఆయనకి జీవితకాలానికి సరిపడా మంచిచేసింది. అందుకే అంటారు ... భగవంతుడు ఏర్పరిచిన బంధాలను ఎవరూ వేరు చేయలేరని !