ఆటంకాలు కలగకుండా చూసే అమ్మవారు
జమదగ్నిమహర్షి భార్య ... పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి ... రేణుకా ఎల్లమ్మ పేరుతో అనేక ప్రాంతాల్లో గ్రామదేవతగా కొలువుదీరి కనిపిస్తూ ఉంటుంది. గ్రామస్తులంతా అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆశీస్సులే తమని కాపాడుతూ ఉంటాయని విశ్వసిస్తూ వుంటారు.
అలా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం మనకి నల్గొండ జిల్లా 'త్రిపురారం'లో కనిపిస్తుంది. ఈ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉండగానే అమ్మవారి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. అమ్మవారే స్వప్న దర్శనమిచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేసుకుందని చెబుతుంటారు. ఆసక్తికరమైన ఆ కథనాన్ని గురించి ఇక్కడ ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు.
ఈ గ్రామంలో ప్రాచీనకాలంనాటి శివాలయం శిథిలం కావడంతో, పునరుద్ధరించడానికి ఒక భక్తుడు పూనుకున్నాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ భక్తుడికి కలలో రేణుకా ఎల్లమ్మ కనిపించిందట. ఒకప్పుడు శివాలయ నిర్మాణ సమయంలో తన ఆలయాన్ని పడగొట్టి, తిరిగి నిర్మించడం మరిచిపోయారనే విషయాన్ని ఆ భక్తుడికి చెబుతుంది. ఈసారి తన ఆలయాన్ని నిర్మించమనీ, శివాలయ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తానని అంటుంది.
దాంతో ఆ భక్తుడు గ్రామస్తులతో ఆ విషయాన్ని గురించి చెప్పి అమ్మవారి ఆదేశాన్ని అక్షరాలా పాటిస్తాడు. దాని ఫలితంగానే ఇప్పుడున్న అమ్మవారి ఆలయం కనిపిస్తూ వుంటుంది. ఇక ఈ అమ్మవారిని దర్శించినవారికీ ... అంకితభావంతో పూజించినవారికి సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని గ్రామస్తులు విశ్వసిస్తూ వుంటారు. పర్వదినాల్లో ఆ తల్లికి చీరసారెలు సమర్పిస్తుంటారు. అమ్మవారికి ఎలాంటి లోటూ రాకుండా చూసుకుంటూ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు.