భగవంతుడు తీసిన బావి ఇక్కడుంది !

సాధారణంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళితే ... అక్కడ ఏదో ఒక పేరుతో దివ్యతీర్థం కూడా కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడి సంకల్పం మేరకే అక్కడ ఆ దివ్యతీర్థం ఏర్పడిందని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తీర్థం మహిమాన్వితమైనదై ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. అవకాశాన్ని బట్టి ఆ తీర్థంలోని నీటిని తలపై చల్లుకోవడం ... స్నానం చేయడం జరుగుతుంది.

అలాంటి మహిమగల తీర్థం మనకి ' బృందావనం' లో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి లీలా విన్యాసాలకు వేదికగా నిలిచిన ఈ పుణ్యస్థలిని దర్శించుకోవడానికి నిత్యం అనేకమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి వాళ్లందరూ తప్పనిసరిగా 'భాండీర వనం' దర్శిస్తూ వుంటారు. ఇక్కడే అత్యంత పురాతనమైన బావి ఒకటి కనిపిస్తూ వుంటుంది. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ బావిని తన 'వేణువు'తో తవ్వినట్టుగా చెబుతుంటారు.

ఈ కారణంగానే ఈ బావి ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. ఈ బావిని చూసినా చాలానే ఉద్దేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. అమావాస్యతో కూడిన సోమవారం రోజున భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. ఈ రోజున ఈ బావి నీటితో స్నానం చేయడం వలన సమస్త పాపాలు నశించడమే కాకుండా, మనసులోని ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరతాయని చెబుతుంటారు.

సాక్షాత్తు ఆ దేవదేవుడు నడయాడిన నేల ... ఆయన స్వయంగా తవ్విన బావి ... అనే ఆలోచనే అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ వుంటుంది. అందులో స్నానం చేస్తున్నప్పుడు అది మరింత రెట్టింపు అవుతుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడానికి మించిన మహద్భాగ్యమే లేదనిపిస్తుంది.


More Bhakti News