ఈ రోజున పెరుగును దానం చేయాలి !
ఒక్కో పుణ్యతిథి రోజున ఒక్కో దానం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున 'పెరుగు'ను దానం చేయాలని అంటారు. ఎందుకంటే భాద్రపద శుద్ధ ద్వాదశి 'వామన జయంతి' గా చెప్పబడుతోంది.
లోక కల్యాణం కోసం శ్రీమన్నారాయణుడు 'వామనుడు'గా అవతరించిన ఈ రోజున, ఆ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగును దానం చేయవలసి ఉంటుంది. శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల్లో అయిదవదిగా 'వామనావతారం' కనిపిస్తుంది. బలిచక్రవర్తి ... దేవేంద్రుడి సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. సింహాసనానికి దూరమై దేవేంద్రుడు బాధపడుతూ ఉండటాన్ని అతని తల్లి చూడలేకపోతుంది.
తన కొడుకుకి సింహాసనం దక్కేలా చేయమని శ్రీమన్నారాయణుడిని కోరుతుంది. దాంతో ఈ విషయాన్ని గురించి చింతించవలసిన పనిలేదని ఆయన ఆమెకి మాట ఇస్తాడు. గతంలో ప్రహ్లాదుడికి మాట ఇచ్చిన కారణంగా ఆయన వంశానికి చెందిన బలిచక్రవర్తిని దండించడం కుదరదు గనుక, సున్నితంగా ఈ సమస్యను పరిష్కరించాలని శ్రీమన్నారాయణుడు అనుకుంటాడు.
దేవేంద్రుడి తల్లి గర్భాన జన్మించి వామనుడిగా వెళ్లి బలిచక్రవర్తి నుంచి మూడు అడుగుల చోటును దానంగా పొందుతాడు. పాతాళలోకాన్ని పాలించమని చెప్పి బలిచక్రవర్తిని అక్కడికి అణచివేసి ... దేవేంద్రుడికి సింహాసనాన్ని అప్పగిస్తాడు. ఈ కార్యం నిమిత్తం స్వామివారు ఆవిర్భవించిన ఈ రోజు ... ఆయన జయంతిగా చెప్పబడుతోంది.
ఏకాదశి రోజున ఉపవాస ... జాగరణాలతో శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన భక్తులు, ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ... పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. వామనుడి ప్రతిమనుగానీ ... చిత్రపటాన్నిగాని వుంచి భక్తి శ్రద్ధలతో పూజించి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించాలి. ఆ తరువాత బ్రాహ్మణులకు పెరుగును దానం చేయవలసి వుంటుంది. ఈ విధమైన నియమాలను పాటిస్తూ స్వామివారిని ఆరాధించడం వలన విశేషమైనటువంటి పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.