ఇక్కడి గణపతిని ఇలా కొలుస్తుంటారు
భూలోకంలో ఎవరు కఠోరమైన తపస్సును ఆరంభిస్తున్నా ... యజ్ఞ యాగాదులను ప్రారంభిస్తున్నా ముందుగా దేవేంద్రుడు కంగారుపడిపోతుంటాడు. తన పదవికి ఎసరు వస్తుందేమోనని ఆందోళన చెందుతూ ఉంటాడు. ఆ కారణంగానే వాళ్ల తపస్సుకు ... యజ్ఞయాగాదులకు భంగం కలిగించడానికి నానారకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగే 'అభినందుడు' అనే తపోబల సంపన్నుడైన రాజు విషయంలోనూ వ్యవహరిస్తాడు.
అభినందుడు యజ్ఞయాగాదులను ఆరంభించాడని తెలియగానే, వాటిని ధ్వంసం చేసి రావలసిందిగా 'విఘ్నాసురుడు' అనే రాక్షసుడిని దేవేంద్రుడు పంపిస్తాడు. ఆ రాక్షసుడు యజ్ఞయాగాదులను ధ్వసం చేయడమే కాకుండా, సాధుసత్పురుషులను అనేక విధాలుగా బాధించసాగాడు. దాంతో మహర్షులు ... మునీశ్వరులు తమ ఆవేదనను వినాయకుడి చెంత వినిపిస్తారు.
ముందుగా హెచ్చరిక చేసినా విఘ్నాసురుడు లెక్కచేయకపోవడంతో వినాయకుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాడు. వినాయకుడి శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేసిన విఘ్నాసురుడికి, ఆయన చేతిలో తనకి చావుతప్పదనే విషయం తెలిసిపోతుంది. దాంతో తన పరాజయాన్ని అంగీకరిస్తూ మన్నించమని వేడుకుంటాడు. వినాయకుడిని శాంతింపజేస్తూ తన పేరుని కలుపుకుని అక్కడ పూజాభిషేకాలు అందుకోవలసిందిగా కోరతాడు.
అలా వినాయకుడు ... ఈ క్షేత్రంలో 'విఘ్నహర వినాయకుడు'గా ... 'విఘ్నేశ్వరుడు'గా దర్శనమిస్తూ వుంటాడు. పూణే సమీపంలోని 'ఓఝర్' గ్రామంలో గల ఈ క్షేత్రం ... అష్ట గణపతి క్షేత్రాల్లో ఒకటిగా అలరారుతూ వుంటుంది. అడుగడుగునా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది.